వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మరింత సాంకేతిక పరిజ్ఞానం

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : అసెంబ్లీ ఎన్నికల్లో కంటే కూడా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ అన్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీతో పాటు, తెలంగాణలోనూ పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని, ఈ నేపథ్యంలో చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ తెలుగు రాష్ట్రాల్లో పర్యటనకు వచ్చారని చెప్పారు. ఎపి పర్యటన తర్వాత మంగళవారం రాత్రి తెలంగాణకు వచ్చారని, ఈ క్రమంలోనే వచ్చే పార్లమెంటు ఎన్నికల సన్నద్ధతపై ఆయన నేరుగా కలెక్టర్ల (డిఇఒ)లతో సమీక్షించారు. జిల్లా ఎన్నికల అధికారులు (డిఇఒ)లు, రిటర్నింగ్‌ ఆఫీసర్లు (ఆర్‌ఒ)లకు రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని (సర్టిఫికేషన్‌ ప్రొగ్రామ్‌) బుధవారం నగరంలోని టూరిజం ప్లాజాలో కేంద్ర చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సునీల్‌ అరోరా ప్రారంభించారు. కలెక్టర్లకు తొలి రోజు నిర్వహించిన సమావేశంలో చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌తో పాటు ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ ఎస్‌.కె.జోషి, డిజిపి, హైదరాబాద్‌ సిపి, జిహెచ్‌ఎంసి కమిషనర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజత్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ ఇవిఎం, వివిప్యాట్‌ల పనితీరు, ఇఆర్‌ఒ నెట్‌, ఎన్నికల సంఘం రూపొందించిన సివిజిల్‌ యాప్స్‌ తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఓటర్లను రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రలోభ పెడుతున్న అంశాలపై ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సివిజిల్‌ యాప్‌కు ఫిర్యాదులు వచ్చాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల అనుభవాలు, లోటుపాట్లు సదస్సులో చర్చకు వచ్చాయన్నారు. వికారాబాద్‌ కలెక్టర్‌ ఒమర్‌ జలీల్‌ అంశం ప్రస్తావనకు వచ్చిందా? అని మీడియ అడిగిన ప్రశ్నకు రజత్‌ కుమార్‌ సమాధానమిస్తూ ఎన్నికల ఫలితాల వెల్లడించిన అనంతరం రెండు మాసాల వరకు ఇవిఎంలను తెరవ కూడదన్న నిబంధనలు ఉన్నప్పటికీ వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఒమర్‌ జలీల్‌ వాటిని తెరిచారని, అవగాహన లేక పోవడం వల్లే ఆయన వాటిని తెరిచారన్నారు. ఇలాంటి తప్పులు భవిష్యత్తులో పునరావృతం కాకూడదని ఇసి ఆదేశించిందన్నారు. నిజానికి ఒమర్‌ జలీల్‌ది కూడా ఒక రకంగా స్వయంకృతాపరాధమేనని ఆయన చెప్పారు. ఇలాంటి పొరపాట్లు వచ్చే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా చోటు చేసుకోకుండా ఉండాలంటే క్షేత్రస్థాయిలో క్రియాశీల పాత్ర పోషించే డిఇఒలపై ఎన్నికల కోడ్‌ మొదలు కొన్ని ఇవిఎం, వివిప్యాట్‌ల పనితీరుపై క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ శిక్షణ ద్వారా వారికి అన్ని విషయాలు తెలియజేసి పరీక్ష పెడతామని, అయినా వారు అదే పొరపాట్లు చేస్తే రెండోసారి కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ నెల 20, 21 తేదీల్లో శిక్షణ ఇచ్చి మరోసారి పరీక్ష పెడతారన్నారు. రెండో సారి శిక్షణ అనంతరం కూడా వారు ఆ టెస్ట్‌లో పాస్‌ కాకపోతే వారిని ఎన్నికల విధుల నుండి దూరంగా ఉంచే అవకాశాలు ఉంటాయన్నారు. సిబ్బంది కొరత రాకుండా ఉంచాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంటుందన్నారు. ఒమర్‌ జలీల్‌ స్థానంలో రంగారెడ్డి కలెక్టర్‌కు వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారని అన్నారు. ఒక్కో కలెక్టర్‌ రెండు జిల్లాల బాధ్యతలను చూస్తూ పని ఒత్తిడి అధికంగా ఉంటే అది ఎన్నికలపైనా పడే ప్రమాదం ఉందన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?