లాక్ డౌన్ వేళ పేద ప్రజలకు కేంద్రం భారీ ఆర్ధిక ప్యాకేజీ

న్యూఢిల్లీ: కరోనా కల్లోలంతో లాక్ డౌన్ వేళ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు కేంద్రం ఆపన్న హస్తం అందించింది. గరీబ్ కల్యాణ్ పేరుతో రూ. లక్షా 70 వేల కోట్లతో భారీ ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ… ఆహార అవసరాలు, రోజువారీ అవసరాలకు సాయంగా గరీబ్ కల్యాణ్ స్కీమ్ పేరుతో రూ.1.70లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. వలస కార్మికులు, పట్టణ, గ్రామీణ పేదలను ఆదుకునేలా ప్యాకేజీ రూపొందించినట్లు చెప్పారు. పేద కార్మికులను ఆదుకోవడంపైనే ప్రధానంగా దృష్టిపెట్టామని వివరించారు. శానిటేషన్ వర్కర్లు, ఆశా, పారామెడికల్, వైద్యులు, నర్సులకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున ప్రత్యేక బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్యాకేజీని రెండు విధాలుగా అందిస్తాం. ఈ పథకం ద్వారా రానున్న మూడు నెలలకు ఒక్కొక్కరికి నెలకు రూ.5కేజీల బియ్యం పంపిణీ, పేదవాళ్లలో ఒక్కరు కూడా ఆహారం లేకుండా ఉండే పరిస్థితి రానీయం. కులుంబానికి కిలో చొప్పున పప్పులు అందిస్తాం. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్ధిదారులకు నేరుగా సాయం అందిస్తాం. స్వయం సహాయక బృందాలకు రుణపరిమితి రూ.10లక్షలకు పెంపు. ఎలాంటి పూచీకత్తు లేని రుణాలు అందజేస్తాం. దీని ద్వారా 63 లక్షల స్వయం సహాయక బృందాలకు లబ్ధి. దేశ వ్యాప్తంగా 20 కోట్ల మంది మహిళలకు మేలు జరుగుతుంది. ఉపాధిహమీ వేతనాలు రూ.182 నుంచి రూ.202కు పెంపు. ఉజ్వల పథకం కింద లబ్ధదారులకు 3 గ్యాస్ సిలిండర్లు. రూ.15వేల లోపు జీతం ఉన్న ఉద్యోగులకు ఇపిఎఫ్ చందా కేంద్రమే భరిస్తుంది. ఉద్యోగి వాటా 12శాతం, యజమాని వాటా 9శాతం కలిపి ఉద్యోగుల పిఎఫ్ ఖాతాల్లో ప్రభుత్వమే జమ చేస్తుంది. వందమందిలోపు ఉద్యోగులు ఉన్న సంస్థలకు ఇది వర్తిస్తుంది అని ఆర్థిక మంత్రి వివరించారు.

DO YOU LIKE THIS ARTICLE?