లాక్‌డౌన్‌ మళ్లీ పొడిగింపు?

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు
రాష్ట్రంలో తగ్గుముఖం పడుతున్న కరోనా
ప్రజల్లో లాక్‌డౌన్‌పై చర్చ
పరిమిత సడలింపులతో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగించే అవకాశం!
కొన్ని రాష్ట్రాల్లో యథాస్థితి!
ప్రజాపక్షం/హైదరాబాద్‌: రాష్ట్రంలో గత మూడు రోజుల నుంచి కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టడం ఊరటనిచ్చే అంశం. కానీ దేశవ్యాప్తంగా ఢిల్లీ, మహారాష్ట్ర తదితర మరికొన్ని రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసులు ఏ మాత్రం తగ్గడంలేదు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు, వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైరస్‌ కట్టడికి ఔషధం లేకపోవడంతో కేవలం సామాజిక దూరం పాటించడం, లాక్‌డౌన్‌తోనే కరోనాను అదుపు చేయగలమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాతాలు భావిస్తున్నాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే మన దగ్గర కేసుల సంఖ్య, మరణాల సంఖ్య మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే కొంత తక్కువే. శనివారం రాష్ట్రంలో ఏడు పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదవడంతో రాష్ట్రంలో పరిస్థితులు ఆశాజనకంగా మారాయి. అయితే ఇదివరకు పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో కేంద్రంతో నిమిత్తం లేకుండానే తెలంగాణలో లాక్‌డౌన్‌ను మే 7 వరకు పొడిగించారు. ప్రధాని మే 3 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పాటించాలని కోరారు. అయితే ఆ తరువాత కూడా పరిస్థితి ఇలానే కొనసాగితే మరికొన్ని రోజుల పాటు ఆంక్షలను కొనసాగించే అవకాశం ఉన్నట్లు తాజా పరిస్థితులను చూస్తే అర్థమవుతోంది. అయితే తెలంగాణలో మాత్రం ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగితే కొన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం ఉంది. గతంలో కేంద్ర ప్రభుత్వం సడలింపులతో కూడిన కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే వాటిని కొన్ని రాష్ట్రాలు పాటిస్తుంటే మరికొన్ని రాష్ట్రాలు పూర్తి లాక్‌డౌన్‌ను అమలుపరుస్తున్నాయి. అందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. సరుకు రవాణా, ఆహార ఉత్పత్తి యూనిట్లకు సంబంధించిన పరిశ్రమలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సడలింపునిచ్చి లాక్‌డౌన్‌ను కఠినతరంగా అమలుపరుస్తుంది. సోమవారం అన్ని రాష్ట్రాల సిఎంలతో పిఎం మాట్లాడే అవకాశం ఉంది. దీంతో ఇప్పడు అందరి దృష్టి మళ్లీ లాక్‌డౌన్‌పైనే పడింది. లాక్‌డౌన్‌ ఎత్తేస్తరా? లేదా కొన్ని సడలింపులతో పొడిగిస్తరా? అనే ఆసక్తి ప్రజల్లో నెలకొంది. మే3కు మరో వారం రోజులు ఉండగా, మే7కు మరో పది రోజుల సమయముంది.

DO YOU LIKE THIS ARTICLE?