లాక్‌డౌన్‌ మరింత కట్టుదిట్టం!

కఠినంగా అమలు చేసేలా చర్యలు
రాష్ట్ర సరిహద్దులో భద్రత పటిష్టం
కంటైన్‌మెంట్‌ జోన్లలో పోలీసు బందోబస్తు
వాహనదారులు బయటకు రాకుండా పోలీసు శాఖ చర్యలు
అత్యవసర సేవలు మినహా ఇతరులకు అనుమతుల్లేవ్‌
పాసులను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు
కరోనా నియంత్రణ ప్రదేశాల్లో ప్రత్యేక దృష్టి

ప్రజాపక్షం/హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా తీవ్రత నేపథ్యంలో లాక్‌డౌన్‌ను పొడిగించడంతో దానిని మరింత కఠినతరంగా అమలుచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో, వైరస్‌ ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ప్రజలెవరూ అనవసరంగా బయటికి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది.  కరోనా నియంత్రణ ప్రదేశాల్లో ప్రత్యేక దృష్టిసారించి పకడ్బందీగా లాక్‌డౌన్‌ను అమలు చేసేందుకు కృషి చేస్తోంది. అత్యవసర సేవలు మినహా ప్రజలు, వాహనదారులు బయటికి రాకుండా పోలీసుశాఖ గట్టి బందోబస్తు చేస్తుంది. రాష్ట్రం లో లాక్‌డౌన్‌ మే 7వ తేదీ వరకు అమల్లో ఉండడంతో ఇతర రాష్ట్రాల సరిహద్దుల వద్ద కూడా పోలీసులు భద్రతను పెంచి కట్టుదిట్టం గా అమలు చేస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దులో భద్రతను పెంచినట్లు తెలుస్తోంది. వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అంతే కాకుండా రాష్ట్రంలోని ఆదివారం వర కు ఉన్న 292 కంటైన్‌మెంట్‌ జోన్లపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. వైరస్‌ ఎక్కువగా వ్యాప్తి ఉన్న గ్రేటర్‌ హైదరాబాద్‌, సూర్యాపేట, నిజామాబాద్‌తోపాటు ఇతర జిల్లాలపై పోలీసులు ఎక్కువగా దృష్టి పెట్టి ప్రజలు బయటికి రాకుండా ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ వ్యాప్తి జరగకుండా కృషి చేస్తున్నారు. ఆదివారం వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం 858 కేసుల్లో దాదాపు సగం వరకు కేసులు గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి. దీంతో హైదరాబాద్‌( 6 జోన్ల) పరిధిలో 151 కంటైన్‌మెంట్‌ జోన్లు ఉన్నాయి. ప్రతి రోజూ వైద్యారోగ్యశాఖ విడుదల చేసే బులిటెన్‌లో అత్యధికంగా నమోదవుతున్న కేసులు జిహెచ్‌ఎంసి పరిధిలోనే ఉండడంతో పారిశుద్ధ్య, వైద్యశాఖ, పోలీసు శాఖ ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేస్తున్నాయి. కొత్తగా కేసులు నమోదవుతున్న ప్రాంతాలను కంటైన్‌మెంట్‌  జోన్లుగా ఏర్పాటు చేసి జెట్టింగ్‌ మిషనలతో సోడియం హైపో క్లోరైట్‌ను పిచికారి చేస్తున్నారు. అంతేకాకుండా ఆశా వర్కర్లు, వైద్య సిబ్బందితో కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేపడుతున్నారు. రెండు రోజుల క్రితం హైదారబాద్‌లోని ముషీరాబాద్‌ పరిధిలో పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రామ్‌నగర్‌తోపాటు మరికొన్ని జిల్లాల్లో కూడా ఆశావర్కర్లు ఇంటింటి సర్వే చేపట్టారు. కుటుంబ సభ్యుల వివరాలు అడిగి నోట్‌ చేసుకుంటున్నారు. అలాగే కంటైన్‌మెంట్‌ జోన్లలో ప్రజలు బయటికి రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేసి వారికి అవసరమయ్యే నిత్యావసర సరుకులు, మందులను ప్రత్యేక సిబ్బంది చేత పంపిణీ చేస్తున్నారు.
పాసులు దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు: సిపి అంజనీకుమార్‌
గతంలో అత్యవసర సేవల్లో భాగంగా వైద్య, మెడికల్‌, పారిశుద్ధ్య సిబ్బందితోపాటు మరికొంత మందికి అత్యవసర ప్రయాణాల నిమిత్తం ప్రత్యేక పాసులను లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖ జారీ చేసింది. అయితే ఈ పాసులను కొంత మంది దుర్వినియోగం చేస్తున్నట్లు పోలీసు శాఖ దృష్టికి వచ్చింది. ఇలాంటి వారిపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. పాసుల దుర్వినియోగంపై హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ హెచ్చరించారు. పాసులు దుర్వినియోగం చేస్తు వాహనాలను సీజ్‌ చేయడంతోపాటు కేసులు కూడా పెడతామన్నారు. తొలుత రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో మొదలైన ఈ పాసుల మంజూరు ప్రస్తుతం రాష్ట్రమంతటా అనుమతిస్తున్నారు. ప్రజలు అనవసరంగా బయటికి రాకుండా ఉండేందుకు నగరంలో 12 వేల మంది పోలీసు సిబ్బంది 24 గంటల పాటు విధుల్లో ఉంటున్నారని తెలిపారు. నగరంలో ఉండే నిరుపేదలు, వలస కూలీల కోసం దాతలు, జిహెచ్‌ఎంసి సహకారంతో నిత్యావసర సరుకులు, శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు, సబ్బులు పంపిణీ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఇప్పటి వరకు రోడ్లపైకి వచ్చిన 69 వేలకు పైగా వాహనాలను సీజ్‌ చేశామని ఆయన పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 49 వేల మందిపై కేసులు నమోదు చేశామని ఆయన తాజాగా మీడియాతో వెల్లడించారు.

DO YOU LIKE THIS ARTICLE?