రైతు సంఘం నేత కొల్లి నాగేశ్వరరావు కన్నుమూత

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : సిపిఐ సీనియర్‌ నాయకులు, ప్రముఖ రైతు సంఘం నేత కొల్లి నాగేశ్వరరావు (82) గురువారం విజయవాడలో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య టాన్యా విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. పెద్ద కుమార్తె ప్రగతి కౌశిక్‌, చిన్న కుమార్తె ప్రశాంతి ఇద్దరూ వైద్యులే. వీరిద్దరూ విద్యార్థి ఉద్యమాల్లో పని చేశారు. విద్యార్థి, యువజన సమాఖ్య, కమ్యూనిస్టు నాయకులుగా పని చేసిన టి.లక్ష్మినారాయణ ఆయనకు రెండవ అల్లుడు. కృష్ణాజిల్లా ముసునూరు మండలం గుడిపాడుకు చెందిన రైతు కుటుంబం కొల్లి వెంకయ్య, రమణమ్మకు 1938 ఏప్రిల్‌ 7న కొల్లి నాగేశ్వరరావు జన్మించారు. ఆయన ఎంఎ వరకు చదువుకున్నారు. కమ్యూనిస్టు ఉద్యమంలో మునిగిపోవడంతో మధ్యలోనే పిహెచ్‌డి కోర్సును విడిచిపెట్టారు. బాల సంఘం దశ నుంచే ప్రజా పోరాటాల్లోకి అడుగు పెట్టిన కొల్లి నాగేశ్వరరావు కృషా ్ణజిల్లా సిపిఐ కార్యదర్శిగా 1978 నుంచి 1990 వరకు సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వహించారు. కృష్ణా జిల్లా, శ్రీకాకుళంలో అనేక రైతు పోరాటాల్లో పాల్గొని రైతుసంఘం నాయకుడిగాఎదిగారు. కొల్లి నాగేశ్వరరావు రైతాంగ సమస్యలపై నిరంతరం రాజీలేని పోరాటాలు నిర్వహించారు. విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా, అంచెలంచెలుగా ఎదిగి సిపిఐ, రైతు సంఘంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా రైతు ఉద్యమంపై తనదైన ముద్ర వేశారు. తెలంగాణకు గోదావరీ జలాలే శరణ్యమని హైదరాబాద్‌లో నిరాహారదీక్ష చేసి గోదావరి వాటర్‌ అథారిటీని వేయించడంలో కీలక పాత్ర వహించారు. పత్తి రైతులకు తీవ్ర నష్టం కలిగించిన బహుళ జాతి కంపెనీ మోన్‌శాంటోపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తూనే న్యాయపోరాటంలో గెలిచారు. మూడు ప్రాంతాల్లో నీటిపారుదల వినియోగంపై ఆయన రచించిన ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర జలదర్శిని పుస్తకాన్ని 2004లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఆవిష్కరించారు.
రైతాంగ సమస్యలపై రాజీలేని పోరు: చాడ వెంకట్‌రెడ్డి
ప్రముఖ రైతు సంఘ నాయకులు కొల్లి నాగేశ్వరరావు మరణం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. రైతాంగ సమస్యలపై నిరంతరం రాజీలేని పోరాటం చేశారని ఒక ప్రకటనలో గుర్తు చేశారు. విద్యార్ధి నాయకుడిగా, యువజన నాయకుడిగా,సిపిఐ, రైతు సంఘం నేతగా వివిధ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు. ఆయన మరణం రైతు సంఘానికి తీరని లోటు అని పేర్కొన్నారు. సిపిఐ రాష్ట్ర సమతి తరుపున కొల్లి నాగేశ్వరరావు కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేశారు.
కలిసి పని చేశా: పల్లా
ఉమ్మడి రాష్ర్టంలో కొల్లి నాగేశ్వరరావుతో కలిసి రైతుసంఘంలో బాధ్యతలు నిర్వహించానని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి తెలిపారు. నీటిపారుదల ప్రాజెక్టులపై వారు పుస్తకాలు ప్రచురించారని, రైతాంగానికి సంబందించిన అనేక అంశాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలను ఆహ్వానించి సెమినార్లు, వర్కుషాపులు నిర్వహించారని సంతాప సందేశంలో పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు పల్లా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
రైతు లోకానికి తీరని లోటు: పశ్య పద్మ
కొల్లి నాగేశ్వరరావు మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం అయ్యేందుకు గోదావరి జలాలే ఏకైక మార్గమని, అందుకు పలువురిని కూడగట్టి ఉద్యమించారని గుర్తు చేశారు. కొల్లి నాగేశ్వరారవు మరణం యావత్తు రైతు లోకాని, దేశ ప్రజలకు తీరనలి లోటు అని ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

కొల్లి మరణం కమ్యూనిస్టు ఉద్యమాలకు విషాధ వార్త
కామ్రేడ్‌ కొల్లి నాగేశ్వరరావు మరణం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ కమ్యూనిస్టుఉద్యమాలకు విషాధ వార్త అని సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైతు ఉద్యమాలను నిర్మించిన యోధుడు అని అభివర్ణించారు. ఈ మేరకు గురువారం నాడు సురవరం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. కొల్లి నాగేశ్వరరావుతో తన విద్యార్థి రోజుల్లో కలిసి పని చేసే అవకాశం కలిగిందని గుర్తు చేశారు. అప్పట్లో ఆయన ఎఐఎస్‌ఎఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండేవారని, తరువాత ఆ బాధ్యతను తనకు అప్పగించారన్నారు. బాధ్యతల నుండి తప్పుకున్న తరువాత కూడా రాష్ట్ర విద్యార్థి ఉద్యమాలలో కీలక పాత్రను కొనసాగించారని అన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంటు ఉద్యమంలో కొల్లి మిలిటెంట్‌ పాత్రను నిర్వహిచారని చెప్పారు. కొల్లి నాగేశ్వరారవు నిజాయితీ, నిబద్ధత, అంకితభావం కలిగిన కామ్రేడ్‌ అని, ఆయన క్రమశిక్షణాయుతమైన ఆదర్శప్రాయ జీవితాన్ని గడిపారని అన్నారు. కామ్రేడ్‌ కొల్లి నాగేశ్వరరావు రెడ్‌ సెల్యూట్‌ అని సురవరం పేర్కొన్నారు.
తెలంగాణ అమరవీరుల ట్రస్టు సంతాపం : కొల్లి నాగేశ్వరరావు మృతి పట్ల తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు ప్రధాన కార్యదర్శి, సిపిఐ సీనియర్‌ నాయకులు కందిమళ్ళ ప్రతాపరెడ్డి సంతాపం తెలియజేశారు. తమది 65 సంవత్సరాల స్నేహమని గుర్తు చేసుకున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?