రైతు మరణాలపై లెక్కలు ఎక్కడ?

కేంద్ర సర్కారుకు విపక్షాల సూటి ప్రశ్న
వాస్తవాల కోసం జెపిసి ఏర్పాటుకు డిమాండ్‌
జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతికి వినతి
లేఖపై సంతకం చేయని కాంగ్రెస్‌
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో సుమారు ఎనిమిదిన్నర నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ప్రతిపక్ష పార్టీ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆందోళన మొదలైనప్పటి నుంచి ఇంత వరకూ ఎంత మంది రైతులు మృతి చెందారో లెక్కలు ఎక్కడని కేంద్ర సర్కారును సూటిగా ప్రశ్నించాయి. రైతు మరణాలను నిర్ధారించేందుకు సం యుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి)ని ఏర్పాటు చేయాల్సిందిగా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాసిన విపక్ష పార్టీలు, శనివారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. సిపిఐ, సిపిఎం, ఎన్‌సిపి, శిరోమణి అకాలీదళ్‌, బిఎస్‌పి, జెకెఎన్‌సి, ఆర్‌ఎల్‌పి, శివసేన పార్టీలు సంతకాలు చేసిన లేఖను రాష్ట్రపతికి అందచేశారు. జెపిసి ఏర్పాటుకు జోక్యం చేసుకోవాలని ఆయనను కోరారు. ఈ లేఖపై కాంగ్రెస్‌ సంతకం చేయకపోవడం గమనార్హం. మూడు సాగు చట్టాలు, రైతుల ఆందోళన, వారి డిమాండ్లు వంటి అంశాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ అకాలీదళ్‌ నాయకురాలు హర్‌సిమ్రన్‌ కౌర్‌ బాదల్‌ అన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి ఏమాత్రం ప్రయత్నించకుండా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తున్న తరుణంలో రాష్ట్రపతి జోక్యం అవసరమని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ అంశంపై చర్చ కోసం గత రెండు వారాలుగా తాము ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం లేకపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతిని కలిసేందుకు ముందుగానే సమయం తీసుకున్నామని, ఆయన జోక్యాన్ని కోరుతూ లేఖపై సంతకాలు చేయాల్సిందిగా తాను స్వయంగా కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి) నేతలను కోరానని ఆమె అన్నారు. కానీ, దురదృష్టవశాత్తు ఆ రెండు పార్టీల నాయకులు రాలేదని, సంతకాలు కూడా చేయలేదని అన్నారు. కారణాలు తెలియవని పేర్కొన్నారు. వివిధ రాజకీయ పార్టీలు రైతు సమస్యలపై చర్చించాలని వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టిన విషయాన్ని హర్‌సిమ్రన్‌ కౌర్‌ గుర్తుచేశారు. వాటిని తిరస్కరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నదని విమర్శించారు. ఈ అంశాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లి, ఆయన జోక్యాన్ని కోరినట్టు ఆమె వివరించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా సాగే విధంగా ప్రభుత్వంపై రాష్ట్రపతి ఒత్తిడి తేవాలని కోరారు. రైతు సమస్యలను, సాగు చట్టాల డిమాండ్‌ను కేవలం ఒకటిరెండు రాష్ట్రాలకు పరిమితమైన సమస్యగా చిత్రీకరించేందుకు మోడీ సర్కారు ప్రయత్నిస్తున్నదని హర్‌సిమ్రన్‌ కౌర్‌ ఆగ్రహం వ్యక చేశారు. నిజానికి ఇది యావత్‌ దేశానికి సంబంధించిన సమస్య అన్నారు. ఆందోళనల కాలంలో ఎంత మంది రైతులు మృతి చెందారో తెలియాలని, అప్పుడే ఆయా కుటుంబాలకు సాయం చేసేందుకు వీలుంటుందని అన్నారు. అలాంటి సమాచారం ఏదీ తమ వద్ద లేదని కేంద్ర వ్యవశాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ప్రకటించడం దుర్మార్గమని అన్నారు. రైతు మరణాలపై లెక్కలు అత్యవసరని, ఇందుకుగాను జెపిసిని ఏర్పాటు చేయాలని కోరారు. అందులో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు చోటు కల్పించాలని సూచించారు. తమ లేఖపై రాష్ట్రపతి సానుకూలంగా స్పందిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, రాష్ట్రపతిని కలిసిన వారిలో హర్‌సిమ్రన్‌తోపాటు మహమ్మద్‌ ఫైజల్‌ (ఎన్‌సిపి), హస్‌నైన్‌ మసూదీ (జెకెఎన్‌సి), రితేష్‌ పాండే (బిఎస్‌పి), బల్వీందర్‌ సింగ్‌ భుండార్‌ (శిరోమణి అకాలీదళ్‌) ఉన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?