రైతులకు లాభం కోసమే

నియంత్రిత పద్ధతిలో పంటలసాగుపై సిఎం వివరణ
ప్రభుత్వం సూచించిన పంటలనే సాగుచేయాలి
15న క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌
వ్యవసాయంపై సుదీర్ఘంగా చర్చించిన కెసిఆర్‌

ప్రజాపక్షం / హైదరాబాద్‌: రైతులకు లాభం చేయాలనే ఏకైక లక్ష్యంతోనే రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ప్రభుత్వం సూ చించిన పంటలనే రైతులు సాగు చేయాలని కోరా రు. నియంత్రిత పద్ధతిలో వరిపంట సాగు ఈ వర్షాకాలంలోనే ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాలను చర్చించేందుకు ఈ నెల 15న క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నేరుగా మాట్లాడాలని సిఎం నిర్ణయించా రు. రాష్ట్రంలో పంట మార్పిడి, క్రాప్‌ కాలనీల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కెసిఆర్‌ మంగళవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి ఈటల రాజేందర్‌, ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సిఎస్‌ సోమేశ్‌కుమార్‌, ముఖ్యకార్యదర్శులు ఎస్‌.నర్సింగ్‌రావు, బి.జనార్దన్‌రెడ్డి, రామకృష్ణరావు, వ్యవసాయ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రవీణ్‌ రావు, హార్టికల్చర్‌ కార్పొరేషన్‌ ఎండి వెంకట్రామ్‌రెడ్డి, సీడ్‌ కార్పొరేషన్‌ ఎండి కేశవులు, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు విజయ్‌ కుమార్‌, ఉప సంచాలకులు శైలజ, సిఎంఒ కార్యదర్శి స్మితా సభర్వాల్‌ పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి కార్యాలయం మీడియాకు వివరంగా తెలియజేసింది.
వరి పంటతో మార్పు ప్రారంభం
ఈ వర్షాకాలంలో వరిపంటతో నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేసే పద్ధతి ప్రారంభం కావాలని, రాష్ట్రంలో ఈ సారి 50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని మంగళవారం జరిగిన వ్యవసాయ సమీక్షలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ నిర్ణయించారు. ఇందులో సన్న, దొడ్డు రకాలుండాలని ఆయన స్పష్టం చేశారు. పది లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా రకాన్ని పండించాలని నిర్ణయించారు. ఏ ప్రాంతంలో ఏ రైతులు ఏ రకం పండించాలి? ఎంత విస్తీర్ణంలో పండించాలి? అనే విషయాలను త్వరలోనే ప్రభుత్వం వెల్లడిస్తుందన్నారు. ప్రభుత్వం చెప్పిన రకం పంటలు సాగు చేసిన రైతులకే రైతుబంధు ఇవ్వాలని, ఆ పంటలకే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలనే నిర్ణయం జరిగినట్లు తెలిపారు. ఈ వర్షాకాలంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి, 10 లక్షల ఎకరాల్లో కందులు పండించాలని, ఏ పంట ఎక్కడ పండించాలి? ఎంత పండించాలి? అనే వివరాలను అధికారులు త్వరలోనే వెల్లడిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది. పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రాల్లో కూరగాయల సాగు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏ ప్రాంతంలో ఎంత మేరకు కూరగాయలు పండించాలి? ఏ కూరగాయలు పండించాలి? ఎంత విస్తీర్ణంలో పండించాలి? అనే విషయాలు కూడా రైతులకు ప్రభుత్వం సూచిస్తుంది.
సీడ్‌ రెగ్యులేటింగ్‌ అథారిటీ ఏర్పాటు
రాష్ట్రంలో కొత్తగా సీడ్‌ రెగ్యులేటింగ్‌ అథారిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన పంటలనే సాగు చేయాలని నిర్ణయించినందున, ఇకపై విత్తనాలు కూడా ప్రభుత్వం నిర్ణయించిన పంటలకు సంబంధించినవి మాత్రమే విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై విత్తన తయారీ సంస్థలకు, వ్యాపారులకు కచ్చితమైన ఆదేశాలు ఇవ్వడం ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన పంటలకు సంబంధించిన విత్తనాలు మాత్రమే లభ్యమయ్యేలా విత్తన నియంత్రణ అథారిటీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని, అవసరమైతే ఇప్పుడున్న విత్తన చట్టంలో మార్పులు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీడ్‌ కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేకంగ సమావేశం కావాలని సిఎం నిర్ణయించినట్లు సిఎంఒ తెలియజేసింది.
కల్తీ, నకిలీలపై ఉక్కుపాదం
నకిలీ, కల్తీ విత్తనాలు అమ్మే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పత్తి, మిర్చి నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం గ్రహించింది. బుధవారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు పర్యటిస్తాయి. ఇంటెలిజెన్స్‌ వర్గాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిఘా పెట్టాయి. నకిలీ, కల్తీ విత్తనాలు తయారు చేసే వారిని, అమ్మే వారిని వెంటనే గుర్తించి, పిడి యాక్టు కింద కేసు నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా పత్తి, మిరప విత్తనాలు నకిలీవి ఎక్కువగా అమ్మే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం వాటి నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నది. సమగ్ర వ్యవసాయ విధానానికి అనుగుణంగా వ్యవసాయ శాఖను పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ యూనివర్సిటీలో తెలంగాణలో పండించాల్సిన పంటలకు సంబంధించిన పరిశోధనలు ఎక్కువగా జరగాలని ఆదేశించింది. రైతుబంధు సమితిలు క్రియాశీలకంగా మారి వ్యవసాయ సంబంధమైన విషయాల్లో రైతులను సమన్వయ పరచాలని కోరింది. రాష్ట్రంలో గోదాముల నిర్వహణ అంతా సులభంగా, ఏకోన్ముఖంగా జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెటింగ్‌ శాఖను కూడా తెలంగాణలో అమలయ్యే వ్యవసాయ విధానానికి అనుగుణంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నది. తెలంగాణలో పెద్ద ఎత్తున వరి పండుతుంది. ఆ వరిని బియ్యంగా మార్చడం కోసం రాష్ట్రంలో రైసు మిల్లుల సామర్థ్యం బాగా పెరగాలని, ఇందుకోసం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే రైస్‌ మిల్లుల యజమానుల సంఘం ప్రతినిధులతో సిఎం సమావేశం నిర్వహిస్తారని తెలియజేసింది.

DO YOU LIKE THIS ARTICLE?