రైతులందరూ సమానం కాదా?

పరిహారం చెల్లింపులో వివక్ష సరికాదు
‘మేడిగడ్డ’ నష్టపరిహారంపై సర్కారుకు హైకోర్టు అక్షింతలు
హైదరాబాద్‌ లీగల్‌ : “ఒక రైతుకు ఒక విధంగా.. మరో రైతుకు ఇం కో విధంగా పరిహారం చెల్లించడం కుదరదు. రైతులందర్నీ సమానంగా చూడాల్సిన బాధ్య త ప్రభుత్వంపై ఉంది. అయితే, తమ పక్క భూములకు ఇచ్చినట్లుగానే తమకు కూడా పరిహారం ఇవ్వాలని కోరుకునే రైతులు అం దుకు అర్హులని పేర్కొనే విధమైన ఆధారాలను మాత్రం సమర్పించాలి..” అని హైకోర్టు స్ప ష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్‌ నిర్మాణానికి తీసుకున్న తమ భూములకు ఎకరాకు రూ. 3లక్షలే ప్రభుత్వం చెల్లిస్తోందని, తమ పక్క భూములకు రూ.13.75 లక్షలు చెల్లిస్తున్న తెలంగాణ సర్కార్‌ వివక్ష చూపుతోందంటూ పలువురు రైతులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఇటీవల హైకోర్టు విచారించింది. పిటిషనర్లు కూడా రూ.10 లక్షలు అంతకంటే ఎక్కువ చొప్పున ఎకరాకు పరిహారం తీసుకునేందుకు అర్హులని పేర్కొంటూ పత్రాలు సమర్పిస్తే వాటిని పరిగణలోకి తీసుకోవాలని భూ పరిహార సాధికార సంస్థను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరామ్‌ ఆదేశించారు. భూసేకరణ చట్టం కింద ఆ సంస్థ ఏర్పడిందని, ఈ వివా దం సంస్థ ముందున్నందున రైతులు సమర్పించే ఆధారాల్ని బట్టి పరిహార పెంపు చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకోవాలని న్యా యమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. సర్కార్‌ నిర్ణయించిన ధరే ఎకరాకు రూ. 10 లక్షలని, ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరించలేదని రూ.3 లక్షల చొప్పున ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందని పిటిషనర్ల వాదన. పిటిషనర్లు పరిహారం తీసుకోకపోవడంతో వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని కలెక్టర్‌ దగ్గర జమ చేశామని ప్రభుత్వ న్యాయవాది చెప్పా రు. పిటిషనర్లు రూ. పది లక్షలు పరిహారం పొందేందుకు అర్హులని ఆధారాలు చూపిస్తే అందుకు తగినవిధంగా ప్రభుత్వ చర్యలు ఉం టాయని హామీ ఇచ్చారు. ఈ వివాదం ఇప్పు డు భూ పరిహార సాధికార సంస్థ దగ్గర ఉన్నందున అక్కడే పిటిషనర్లు తమ ఆధారాల్ని చూపాలని హైకోర్టు ఆదేశించింది.

DO YOU LIKE THIS ARTICLE?