రైతుపంట.. రైతు ఇష్టం

నియంత్రిత వ్యవసాయం పేరుతో పెత్తనం సరికాదు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే కరోనా విజృంభణ
పెంచిన పెట్రోలు డిజీల్‌ ధరలను వెంటనే తగ్గించాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
ప్రజాపక్షం/హుస్నాబాద్‌ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నియంత్రిత వ్యవసాయం చేయాలని రైతుల మీద పెత్తనం చేయడం మంచిది కాదని, అలా చేస్తే ప్రతి రైతు తిరగబడి ఉద్యమించే పరిస్థితి ఏర్పడుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. రైతులు పంటలు పండించుకోవడానికి వారికి పూర్తి స్వేఛ్చను ఇవ్వాలన్నా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే కరోనా వైరస్‌ విజృంభించే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో చాడ మాట్లాడారు. కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, కరోనా పుట్టిన చైనా దేశం కంటే ఎక్కువ కేసు లు మన దేశంలోనే నమోదయాయ్యని ఆవేద న చెందారు. ముందస్తు సమాచారం ఇవ్వకుం డా కరోనా వైరస్‌ నివారణకు లాక్‌డౌన్‌ విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, దీనివల్ల వలస కూలీలు, అసంఘటిత కార్మికుల బతుకులు దుర్భర స్థితికి చేరాయన్నారు. దేశ ప్రజలను ఆదుకునేందుకు మోడీ ప్రభుత్వం ఆత్మ నిర్భర్‌ భారత్‌ అని ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీలో పేదలకు కేవ లం మూడు లక్షల యాబై వేల కోట్లు మాత్రమే కేటాయించారని అన్నారు. ఈ ప్యాకేజీ కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టెందుకే ప్రకటించారని, వారికే పెద్దపీటవేస్తున్నారన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో పేదలకు అందించిన నెలకు 1500 రూపాయలు కేవలం రెండు నెలలు అందించి ఆ తరువాత పన్నెండు కిలోల బియ్యానికే పరిమితం చేయడం బాధాకరమన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో విద్యుత్‌ బిల్లులను నెలవారీగా తీయకుండా మూడు నెలలవి కలిపి ఒకేసారి రీడింగ్‌ తీయడం వల్ల సర్‌ చార్జీలు, స్లాబుల పేరుతో ఎసిడి బిల్లులతో పేద ప్రజలను దోచుకుంటున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును మూడు సంవత్సరాల్లో పూర్తి చేయడం మంచి విషయమే అయినా హుస్నాబాద్‌ మెట్ట ప్రాంతానికి సాగునీరును తీసుకరావాలనే ఉద్దేశంతో 20 సంవత్సరాల క్రితం ప్రారంభించిన వరద కాలువ పనులను పూర్తి చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని చాడ ప్రశ్నించారు. గౌరవెల్లి గండిపెల్లి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి పరిహారం విషయంలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌తో చర్చించగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పినట్లు చాడ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కరోనా నేపథ్యంలో పెట్రోలు డీజిల్‌ ధరలు పెంచడం, ముడి చమురు బ్యారెల్‌ ధర 100 నుండి 36 డాలర్లకు పడిపోతే ఇక్కడ పెట్రోలు ధరలు పెంచడంపై మండిపడ్డారు. పెంచిన పెట్రోలు డీజిల్‌ ధరలను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్‌, కంట్రోల్‌ కమిషన్‌ సభ్యులు ఎడ్ల వెంకట్రామిరెడ్డి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, మాజీ వైస్‌ ఎంపిపి గడిపె మల్లేశ్‌ , సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు జాగిరి సత్యనారాయణ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వెల్పుల బాలమల్లు, యెడల వనేశ్‌, పోతిరెడ్డి వెంకట్‌రెడ్డి, కనుకుట్ల శంకర్‌, అందె అశోక్‌, సిపిఐ మండల నాయకులు అయిలేని సంజీవరెడ్డి ఉన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?