రెడ్‌ జోన్లలో లాక్‌డౌన్‌..మిగతా చోట్ల సడలింపు : జగన్‌

ఎపిలో కరోనా స్థితిగతులపై  ప్రధానికి వివరించిన జగన్‌
లాక్‌ డౌన్‌అమలుపై సంతృప్తి
వైరస్‌ వ్యాప్తి నిరోధానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నాం
ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సిఎం జగన్‌

ప్రజాపక్షం/అమరావతి : దేశవ్యాప్తంగా అమలవుతోన్న లాక్‌ డౌన్‌ పొడిగింపుపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రధానితో వాస్తవ పరిస్థితుల్ని వివరించారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని, రెడ్‌ జోన్లలో లాక్‌ డౌన్‌ కొనసాగిస్తూ, రెడ్‌ జోన్లు లేని చోట మినహాయింపు ఇస్తే బాగుటుందని జగన్మోహన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌ నివారణా చర్యలపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని  నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్‌నిర్వహించారు.  దీనిలో  ముఖ్యమంత్రి జగన్‌, డిప్యూటీ సీఎం ఆళ్లనాని, హోంమంత్రి మేకతోటి  సుచరిత, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. అదే సమయంలో మానవతా కోణంలో స్పందిస్తున్నారు. రాష్ట్రంలో  1.4 కోట్లకుపైగా ఉన్న  కుటుంబాలను, వారి ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నాం అన్నారు.
కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారికి పరీక్షలు చేసి,  వారికి వైద్యం అందిస్తున్నాని చెప్పారు.
ఏపీలో 2,61,216 గ్రామ, వార్డు వాలంటీర్లు, 40వేల మంది ఆశ వర్కర్లు, 20,200 మంది ఏఎన్‌ఎంలు ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని వివరించారు. కోవిడ్‌ లక్షణాలు ఉన్నవారిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి, వారికి దాదాపు 3వేలమంది వైద్యులు సేవలు అందిస్తున్నారన్నారు. అలాగే కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్న ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌ వ్యూహం కొనసాగుతోందన్నారు. లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయడానికి, ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటిని పర్యవేక్షించడానికి, ఉద్ధృతంగా పరీక్షలు నిర్వహించడానికి, 141 కంటైన్‌మెంట్‌ క్లస్టర్లను హాట్‌స్పాట్లుగా గుర్తించామన్నారు. ఆస్పత్రు ల్లో మౌలిక సదుపాయాలను గణనీయంగా పెం చుతున్నామన్నారు. క్రిటికల్‌ కేర్‌ కోసం నాలుగు అత్యాధునిక ఆస్పత్రులను ఏర్పాటు చేసుకున్నామన్నారు. 13 జిల్లాల్లోని ప్రతి జిల్లాకూ ఒక కోవిడ్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేసుకున్నామన్నారు. జిల్లాల్లో వీటికి అదనంగా మరో 78 ఆస్పత్రులను ఏర్పాటుచేసుకుంటున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. సమర్థవంతంగా క్వారంటైన్‌ చేయడానికి ప్రతి జిల్లాలో కోవిడ్‌ కేర్‌సెంటర్లను ఏర్పాటు చేసుకున్నామని, ఇందులో 26వేల బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయని వివరించారు.సామాన్యులపై, రాష్ట్రంపై లాక్‌డౌన్‌ ప్రభావానికి సంబంధించి కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాని ఆయనపేర్కొన్నారు. మన ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానిదే ప్రధాన భూమిక, జీఎస్‌డీపీలో 35శాతం, ఉపాధి కల్పనలో 62శాతం వాటా వ్యవసాయానిదే, లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల రవాణా గణనీయంగా పడిపోయింది అని వివరించారు. నిలిపివేస్తారనే భయంతో 25శాతం మించి ట్రక్కులు తిరగడంలేదు, రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులను భద్రపరచడానికి, నిల్వచేయడానికి సరిపడా గోదాములు లేవు, మార్కెట్లు నడవకపోవడంతో ధాన్యం, మొక్కజొన్న, మిర్చి, పొగాకు, అరటి, బొప్పాయి, కూరగాయలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కాని స్థానికంగా వీటిని ఎంతవరకు వినియోగించగలం అని పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితి కొనసాగితే లక్షలాది వ్యవసాయ కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. నిల్వచేయడానికి తగిన స్టోరేజీ సదుపాయంలేక, ఎగుమతులు లేక ఆక్వా రంగంకూడా తీవ్రంగా దెబ్బతింటోందని తెలిపారు.
ఇక రాష్ట్రంలోని పారిశ్రామిక రంగం విషయానికొస్తే.. . 1,03,986 యూనిట్లకుగానూ 7,250 మాత్రమే నడుస్తున్నాయని పేర్కొన్నారు. పంపిణీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది, రోడ్డు, రైల్వే రవాణాలు నిలిచిపోవడంకూడా సంక్షోభం పెరగడానికి కారణమయ్యింది, పరిశ్రమలు నడవనప్పు డు… వారు జీతాలు చెల్లించగలరని మనం ఎలా ఆశించగలం?: అని అన్నారు. రాష్ట్రానికి ఆదా యం కూడా రాని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. సహాయ కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత పరిస్థితి తలెత్తింది, లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికులు, దినసరి కూలీలు, వ్యవసాయం, ఉద్యానవన, ఆక్వా రైతులు పూర్తిగా దెబ్బతిన్నారు, కోవిడ్‌ నివారణకు ప్రధాని మంత్రిగా మీరు తీసుకున్న విశాలపరమైన, గట్టి చర్యలను నేను బలంగా సమర్థిస్తున్నాను అని ఆయన అన్నారు. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ చక్రం ముందుకు కదలాలన్నది నా అభిప్రాయం అని అన్నారు. ఆర్థిక వ్యవస్థ చక్రం పూర్తి వేగంతో ముందుకు కదలకపోయినా, కనీసం ప్రజల అవసరాలకు తగినట్టుగా నైనా నడవాలని జగన్‌ పేర్కొన్నారు.1918లో వచ్చిన ఫ్లూ కూడా భారతదేశ ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసింది,రెండేళ్లకుపైగా అది దేశంపై ప్రభావం చూపింది, మనం దీన్ని పరిగణలోకి తీసుకుంటే… దీర్ఘకాలంలో మనం పోరాటంచేయాల్సి ఉంటుంది అని అన్నారు. ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో అందుబాటులో ఉన్న వివరాలను, సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని దాన్ని విశ్లేషించి కొని అన్ని  అంశాలను మీ ముందు ఉంచుతున్నాను అని జగన్‌ తెలిపారు.రాష్ట్రంలో  676 మండలాలు మా రాష్ట్రంలో ఉన్నాయి:కరోనా వైరస్‌ సోకిన మండలాల్లో 37 రెడ్‌జోన్‌లో ఉన్నాయి, ఆరెంజ్‌ జోన్లో 44 మండలాలు ఉన్నాయి: 676 మండలాల్లో 81 మండలాలు రెడ్‌జోన్‌, ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నాయి: 595 మండలాలు గ్రీన్‌జోన్‌లో ఉన్నాయి, ప్రస్తుతానికి కరోనా ప్రభావం వీటిపై లేదు: రెడ్‌జోన్లకే లాక్‌డౌన్‌ పరిమితం చేయాలన్నది నా అభిప్రా యం అని జగన్‌ ప్రధానికి వివరించారు. జనం గుమిగూడకుండా మాల్స్‌, సినిమాహాళ్లు, ప్రార్థనామందిరాలు, ప్రజారవాణా, పాఠశాలలపై ఇప్పుడున్న పరిస్థితి కొనసాగాలన్నది నా అభిప్రాయం అన్నారు. ఇవికాకుండా మిగిలిన చోట్ల భౌతిక దూరం పాటించాలని తెలిపారు. కరోనా వైరస్‌ మరింత వ్యాపించకుండా దేవుడి దయవల్ల అడ్డుకోగలుగుతున్నామన్నారు. మన కంటికి కనిపించని ఈ మహమ్మారి త్వరలోనే నయం అవుతుందని నమ్ముతున్నామన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?