రెండో డోస్‌కు… అధిక ప్రాధాన్యం

వ్యాక్సిన్‌ వేసుకున్న వారినే హోటల్స్‌, మాల్స్‌కు అనుమతించే అవకాశం
కేరళలో 50% డెల్టా కేసులు
కరోనా బాధితులు బయట తిరగొద్దు
ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌రావు
ప్రజాపక్షం/హైదరాబాద్‌ కరోనా వైరస్‌ రెండవ దశ పూర్తిగా తగ్గలేదని ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ రావు అన్నా రు. ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్‌ ప్రాంతాల్లో అధికంగా కేసులు నమోదవుతున్నాయని, ఖమ్మం జిల్లా కూసుమంచిలో భారీగా కేసులు నమోదైన ఘటన లు ఉన్నాయని వివరించారు. ఒకటి, రెండు రోజు ల్లో రెండో డోసుకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నారు. భవిష్యత్తులో వ్యాక్సిన్‌ వేసుకున్న వారినే హోటల్స్‌, మాల్స్‌కు అనుమతించే అవకాశం ఉం టుందన్నారు. కోఠిలోని డిహెచ్‌ కార్యాలయంలో శనివారం శ్రీనివాస్‌రావు మీడియాతో మాట్లాడుతూ అనేక దేశాల్లో డెల్టా రకం తీవ్రంగా ఉందని, కేరళలోనే 50 శాతం డెల్టా కేసులు ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో రెండు డెల్టా ప్లస్‌ కేసులు నమోదయ్యాయన్నారు. కరోనా బాధితులు బయట తిరగొద్దని విజ్ఞప్తి చేశారు. మూడో దశగా మారకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మానవ శరీరంపై డెల్టా వైరస్‌ ప్రభావం ఎక్కువ కాలం ఉంటుందని, అలాగే ఇన్‌పెక్షన్‌ కలిగించే సామర్థ్యాన్ని గుర్తించామన్నారు.
మేలోనే రెండు డెల్టా కేసులు
మే నెల మధ్యలోనే డెల్టా కేసులను హైదరాబాద్‌లో గుర్తించామన్నారు. డెల్టా ప్లస్‌ పాజిటివ్‌ వచ్చిన వారు కొలుకున్నారని, వారి కాంటాక్ట్‌ను ట్రేస్‌ చేసి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ వచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో 2.2 కోట్ల మంది ప్రజలు వ్యాక్సిన్‌కు అర్హులని, 1.12 కోట్ల మందికి ఇప్పటి వరకు సింగల్‌ డోస్‌ ఇచ్చామని, 33.79 లక్షల మందికి సెకండ్‌ డోస్‌ పూర్తయిందని, తొలి డోస్‌ తీసుకున్న వారిలో 30 శాతం మందికి రెండో డోస్‌ ఇచ్చామని వివరించారు. ఈ నెలలో ఇప్పటి వరకు 30.04 లక్షల టీకా డోసులు రాష్ట్రానికి వచ్చాయని, కేటాయించిన దానికన్నా 9.5 లక్షల టీకా డోసులు అదనంగా రాష్ట్రానికి వచ్చాయని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 22.32 లక్షల మందికి కొవిషీల్డ్‌ రెండవ డోస్‌ ఇవ్వాల్సి ఉండగా వారిలో 12 లక్షల మందికి ఇచ్చామని, కొవాగ్జిన్‌ 3 లక్షల మందికి పైగా రెండవడోస్‌ ఇవ్వాల్సి ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9 జిల్లాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయన్నారు.
థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం
రాష్ట్రంలో థర్డ్‌ వేవ్‌ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని డాక్టర్‌ శ్రీనివాస్‌ రావు తెలిపారు. ఆక్సిజన్‌, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నాయన్నారు. వారికి తగిన శిక్షణ అందించడంతో పాటు ప్రభుత్వం పరిధిలోని 26 వేల బెడ్స్‌ను ఆక్సిజన్‌ సదుపాయాలను ఏర్పాటు చేశామన్నారు. పిల్లల కోసం జిల్లా ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని, 100కు పైగా బెడ్స్‌ ఉన్న అన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు ఆగస్టు నెలాఖరు నాటికి ఆక్సిజన్‌ ప్లాంట్స్‌ అందుబాటులోకి తెచ్చుకోవాలని ఆదేశించారు

DO YOU LIKE THIS ARTICLE?