రూ. 787 కోట్ల పిఎన్‌బి స్కామ్‌ కమల్‌నాథ్‌ మేనల్లుడి ఇంటిపై సిబిఐ దాడులు

మోసర్‌ బేర్‌ కంపెనీ కార్యాలయాల్లో తనిఖీలు
న్యూఢిల్లీ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పిఎన్‌బి) లో రూ. 787 కోట్ల అవకతవకలకు సంబంధించి మోసర్‌ బేర్‌ సోలార్‌ లిమిటెడ్‌ కంపెనీ పాత్రపై సిబిఐ దృష్టి సారించింది. ఈ కేసులో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ మేరకు కాంగ్రెస్‌ నాయకుడు కమల్‌నాథ్‌ మేనల్లుడు రతుల్‌ పూరీ, అతని తల్లిదండ్రుల నివాసాలు, కార్యాలయాలపై సిబిఐ శుక్రవారం ఏకకాలంలో దాడులు చేసి, విస్తృత తనిఖీలు నిర్వహించింది. ఢిల్లీ, నొయిడా, ఘజియాబాద్‌, అన్నూపూర్‌ (మధ్యప్రదేశ్‌)లలో ఈ దాడులు జరిగాయి. మోసర్‌ బేర్‌ కంపెనీకి రతుల్‌ పూరీ మాజీ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌. కంపెనీ డైరెక్టర్లుగా వున్న రతుల్‌ తల్లి నీతా పూరి (కమల్‌నాథ్‌ సోదరి), తండ్రి దీపక్‌ పూరీలపై కూడా సిబిఐ కేసులు నమోదు చేసింది. దేశంలో ఏడు ప్రాంతాల్లో దాడులు జరిపి, తనిఖీలు చేపట్టామని, ఢిల్లీలోని న్యూఫ్రెండ్స్‌ కాలనీ ప్రాంతంలో ప్రధానంగా తనిఖీలు జరిపినట్లు సిబిఐ అధికారులు తెలిపారు. కరోనా వైరస్‌ కారణంగా ఇలాంటి కేసుల దర్యాప్తు మందగించింది. అయితే వ్యక్తిగత రక్షణ పరికరాలు, దుస్తులు ధరించి ఈ దాడులు జరిపారు. పూరీ కంపెనీకి చెందిన సునీతా గుప్తా, దీపక్‌ ఖండేల్‌వాల్‌, రాజేష్‌ ఖండేల్‌వాల్‌, సునీతా మౌద్గల్‌, సంజయ్‌ జైన్‌, ఇతర డైరెక్టర్లందరిపైనా సిబిఐ కేసులు పెట్టింది. స్పెయిన్‌ నివాసి బెర్నార్డ్‌ హెర్మన్‌ గాలస్‌ కూడా ఈ కేసులో నిందితుడే. 2014 వరకు అతనొక అదనపు డైరెక్టర్‌గా వున్నారు. రతుల్‌ పూరీ మోసర్‌ బేర్‌ కంపెనీకి సంబంధించి ఇప్పటికే 354 కోట్ల పిఎన్‌బి బ్యాంకు స్కామ్‌లో వేరే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సిబిఐకి అందిన ఫిర్యాదు మేరకు మోసర్‌ బేర్‌ 9 బ్యాంకుల్లో పెద్ద ఎత్తున డబ్బు తీసుకొని, మోసం చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటున్నది.

DO YOU LIKE THIS ARTICLE?