రూ. 5 వేలకు పసికందు అమ్మకం

మెదక్‌ జిల్లా చిలప్‌చేడ్‌ మండలంలో ఘటన
ప్రజాపక్షం/చిలిప్‌చెడ్‌ : ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు’ అన్న అందెశ్రీ మాటలు నేడు అక్షర సత్యాలుగా నిలుస్తున్నాయనే చెప్పాలి. అధికారులు, నాయకులు అన్ని కార్యక్రమాలలో అవగాహన కల్పిస్తున్నా నేటికీ ప్రజలలో మార్పు రావడం లేదనే చెప్పాలి. వివరాల్లోకి వెళ్తే మెదక్‌ జిల్లా చిలప్‌చేడ్‌ మండలంలోని బాద్రి యా తాండ బాహుసింగ్‌ తండాకు చెందిన సంగీత, రాజు అనే దంపతులకు ఇది వరకే ఇద్దరు ఆడ కూతుర్లు పుట్టారు. ఈ సారి అయి నా కొడుకు  పుట్టకపోతారా అని చూడగా వారి ఆశ నిరాశే అయింది. ఆదివారం మెదక్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో మళ్ళీ కూతురు జన్మించింది. కొడుకు పుడుతాడాని ఆశతో ఉన్న వాళ్ళకి మళ్ళీ కూతురే పుట్టే సరికి కన్న తల్లిదండ్రులే కసాయిలుగా మారి అ పసికందును విక్రయించాలని నిర్ణయించుకున్నారు. వీరికి చిన్న ఘనపూర్‌ గ్రామానికి చెందిన ఆశవర్కర్‌ తోడై మధ్యవర్తిగా చేరి రూ. 5 వేలకు అమ్మేశారు. విషయం తెలుసుకున్న బాలల పరిరక్షణ అధికారులు ప్రొటెక్షన్‌ ఇన్‌చార్జి నాగరాజు, స్థానిక ఎస్‌ఐ మల్లారెడ్డి సహకారంతో పసికందును తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న సిడిపిఒ హేమభార్గవి బాద్రియా తండాకు చేరుకొని బాధిత కుటుంబీకులకు, తాండ వాసులకు అవగాహన కల్పించారు. అత్త మామలపై కేసులు నమోదు చేయిస్తామన్నారు. అనంతరం స్థానిక ఎంఎల్‌ఎ మదన్‌రెడ్డి తండాకు వచ్చి కంప్యూటర్‌ యుగంలో కూడా ఇలాంటి చర్యలు జరగడం బాధాకరమని, చిలప్‌చేడ్‌ మండలంలో జరగడం ఆవేదన కలిగిస్తోందన్నారు. మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని అధికారులను కోరారు. చిన్న పిల్లల్ని అమ్మడం, కొనడం నేరమని, ఒకవేళ దత్తత తీసుకొనలనుకునేవారు చట్టపరంగా అనుమతి పొంది తీసుకోవాలన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై అధికారులు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటారని, చట్టం ఎవరికీ చుట్టం కాదు అని ఆయన హెచ్చరించారు. అనంతరం తల్లి, బిడ్డ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. తెలంగాణ ప్రభుత్వం ఆడపిల్లల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, అధైర్యపడకుండా ఉండాలని, బాధిత కుటుంబానికి 2వేల రూపాయలు, బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి శేషసాయిరెడ్డి, సర్పంచ్‌ బుజ్జిబాయి, ఎస్‌ఐ మల్లారెడ్డి, సిడిపిఒ హేమభార్గవి, ఐసిడిసి జ్యోతి, టిఆర్‌ఎస్‌ పార్టీ ప్రెసిడెంట్‌ అశోక్‌ రెడ్డి, అంగన్‌వాడీ కార్యకర్తలు దుర్గ, శ్యామల, శహనాజ్‌ బేగం తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?