రూ.200 కోట్లు…బెట్టింగ్‌ల జోరు!

ప్రజాపక్షం/ హైదరాబాద్‌
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. ఏ పార్టీ అధికారం చేపడుతుంది? ఏ నియోజక వర్గంలో ఏ అభ్యర్థి గెలుస్తాడు? ఆపధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్‌ గెలుస్తారా? టిపిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి పరిస్థితి? అనే అంశాలపైనే బెట్టింగ్‌లు సాగుతున్నాయని తెలుస్తుంది. పట్టణస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు కూడా బెట్టింగ్‌లో హోరు మార్మోగిపోతుంది. ఏ గల్లిలో చూసినా పలా నా అభ్యర్థి గెలుస్తాడు, పలానా అభ్యర్థి ఓడిపోతాడు అని వారి వారి అభిమానులు, ఆయా పార్టీల ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు, ఎంపిటిసి సభ్యులు, మాజీ సర్పంచులు బెట్టింగ్‌లో పాల్గొంటున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, కడప, అమరావతి, చిలకలూరిపేట, తిరుపతి, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో సైతం తెలంగాణలో ఏర్పాటుకానున్న ప్రభుత్వంపై బెట్టింగ్‌లు కడుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో కలిసి బెట్టింగ్‌ల విలువ రూ.150 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇద్దరి మధ్య నడిచే బెట్టింగ్‌లు రూ.వెయ్యి నుంచి రూ.50 లక్షల వరకు కూడా ఉన్నట్లు సమాచారం. ఇక లగడపాటి రాజగోపాల్‌ తన సర్వే ఫలితాలను వెల్లడించడం, మరో పక్క పలు జాతీయ సర్వేలు సైతం వారి ఫలితాలను వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు వెల్లడించిన సర్వేలు అన్ని ఒకే విధంగా కాకుండా పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. కొన్ని సర్వేలు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, మరికొన్ని సర్వేలు ప్రజాఫ్రంట్‌ అని తేల్చాయి. దీంతో ప్రజల్లో ఆయోమయ పరిస్థితి ఏర్పడింది. అయితే ఎవరి ధీమా వారికి ఉండడంతో జోరుగా బెట్టింగ్‌లు పెడుతున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గ్రామ స్థాయిలో కిరాణా షాప్‌ యజమాని ప్రజాఫ్రంట్‌ అధికారం చేబడుతుందని రూ.50 వేలు బెట్టింగ్‌ కాశాడు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలోనే కోట్లాది రూపాయల బెట్టింగ్‌ నడుస్తున్నట్లు తెలుస్తుంది. ఇక పట్టణ ప్రాంతాల్లో యువకులు, విద్యార్థులు, ఐటి ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు సైతం బెట్టింగ్‌లు కట్టినట్లు సమాచారం. కెసిఆర్‌ ఓడిపోతున్నాడని కొందరు, గెలుస్తున్నాడని మరికొందరు బెట్టింగ్‌లు పెట్టారు. కెసిఆర్‌ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచి, ఇటీవలే అరెస్టు హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేయించడంలో విజయం సాధించిన టిపిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  రేవంత్‌రెడ్డి గెలుపోటములపై కూడా జోరుగా బెట్టింగ్‌లు కట్టినట్లు తెలిసింది. కూకట్‌పల్లి ప్రజాకూటమి టిడిపి అభ్యర్థి  నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని గెలుపోటములపై ఆంధ్రలోని వివిధ ప్రాంతాలలో జోరుగా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. తెలంగాణ ఎన్నికలపై ఉభయ తెలుగు రాష్ట్రాలలో సాగుతున్న బెట్టింగ్‌లు క్రికెట్‌ బెట్టింగ్‌లను తలదన్నేదిగా తలపిస్తుంది. తెలంగాణ కంటే ఆంధ్రలోనే ఎక్కువ బెట్టింగ్‌లు నడుస్తున్నట్లు సమాచారం. ఆంధ్రలో కోడి పందాలను తలపించే విధంగా కాయ్‌ రాజ కాయ్‌ అంటూ తెలంగాణ ఎన్నికలపై బెట్టింగ్‌లో జోరుగా సాగుతున్నాయి. కాకినాడలో ఓ చాపల చెరువు రైతు ఏకంగా తెలంగాణ ఎన్నికలపై రూ.15 లక్షలు బెట్టింగ్‌ కట్టాడు. లగడపాటి సర్వేపై ఇతగాడు పందం కట్టినట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఇక షాద్‌నగర్‌లో ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి రూ.2 కోట్లు విలువైన తన అర ఎకర భూమిని బెట్టింగ్‌లో పెట్టాడని తెలుస్తుంది. అయితే ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ ఎన్నికలపై బెట్టింగ్‌లో నడుస్తుండగా కేవలం రంగారెడ్డి జిల్లాలో మాత్రమే ఒక కేసు నమోదైంది.పోలీసులు బెట్టింగ్‌లపై ఫిర్యాదులు వచ్చినా సరైనా సాక్ష్యాధారాలు లభించకపోవడంతో కేసులు నమోదు చేయలేదని ఓ అధికారి తెలిపారు. క్రికెట్‌ బెట్టింగ్‌లకు ఎన్నికల బెట్టింగ్‌లకు చాలా వ్యత్యాసం ఉండడం కారణంగానే తమకు సరైనా ఆధారాలు లభించడంలేదని అంటున్నారు. అదే క్రికెట్‌  బెట్టింగ్‌లో బూకీ, ఫంటర్లు బెట్టింగ్‌లు కడుతూ ఒక గదిలో టివి ద్వారా క్రికెట్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తూంటారు. అలాగే ఆన్‌లైన్‌లో చాటింగ్‌లో కూడా బెట్టింగ్‌లు నడుస్తాయి. ఇవి ఆధారాల రూపంలో ఉండడంతో పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేసేందుకు వీలు కలుగుతుందన్నారు.ప్రస్తుతం తెలంగా ణ ఎన్నికలపై నడుస్తున్న బెట్టింగ్‌లన్ని కూడా కేవలం ఇద్దరు ముగ్గురి మధ్యనే రహాస్యంగా సాగడం, వారంతా ఒక చూట ఉండాల్సిన అవసరం కూడా ఉండకపోవడంతో బెట్టింగ్‌ రహాస్యాలను చేధించలేక పోతున్నామన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?