రూ.20 లక్షలతో ఆర్థిక ప్యాకేజీ

ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌గా నామకరణం
జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోడీ వెల్లడి
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలో ప్రజలకు ఊతం లభించేలా ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌’ పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీ కింద 20 లక్షల రూపాయలను కేటాయిస్తున్నట్లు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఇది దోహదం చేస్తుందని, కరోనాతో కష్టాల్లో పడిన ప్రజలను ఆదుకునేందుకు, చిన్న, మధ్య తర హా పరిశ్రమలను పునరుద్దరించేందుకు, ఉపా ధి అవకాశాలు పెంచేందుకు ఈ ప్యాకేజీ ఉపకరిస్తుందన్నారు. ప్రధాని మోడీ మంగళవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం మూడవ దశ లాక్‌డౌన్‌ కొనసాగుతున్నదని, వివిధ మినహాయింపులతో నాల్గవ దశ లాక్‌డౌన్‌కు సిద్ధంగా వుండాలని సూచనప్రాయంగా వెల్లడించారు. దేశం కోసం 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నామని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారంనాడు వెల్లడిస్తారని తెలిపారు. ఈ ప్యాకేజీ విలువ దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో దాదాపు 10 శాతం ఉంటుందన్నారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌కు కావాల్సిన ఆర్ధిక దన్ను ఈ ప్యాకేజీ అందిస్తుందని, ఈ ప్యాకేజీ కరోనాపై పోరాటంలో ప్రతి ఒక్కరికీ చేయూతనిస్తుందని ప్రధాని చెప్పారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ లక్ష్యం దిశగా కొన్ని కీలక సంస్కరణలు అత్యవసరమని, భారత్‌ ప్రభుత్వం ఇచ్చే ప్రతి పైసా లబ్దిదారులకు చేరాలన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక ప్యాకేజీ ద్వారా ఊతం అందిస్తామన్నారు. దేశంలో ప్రతి పారిశ్రామికుడిని కలుపుకొని పోయేలా ఈ ఆర్థిక ప్యాకేజీ ఉంటుందని చెప్పారు. భారత పారిశ్రామిక రంగానికి మరింత బలాన్ని చేకూర్చేలా ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందని చెప్పారు. మేకిన్‌ ఇండియా కార్యక్రమానికి ఈ ప్యాకేజీ మరింత బలాన్ని చేకూరుస్తుంది. దేశవాళీ ఉత్పత్తుల కొనుగోలుకే ప్రజలు ప్రాధాన్యతనివ్వాలని, తద్వారా మన ఆర్థిక వ్యవస్థ చక్కబడుతుందని చెప్పారు. నేడు మనం తీసుకుంటున్న చర్యలకు మొత్తం ప్రపంచం ప్రశంసలు వస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు. ఇవాళ ప్రపంచం మొత్తం సంక్షోభంలో ఉందని, మనం మరింత నిబ్బరంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఆత్మనిబ్బర భారత్‌ సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా 42 లక్షలమందికిపైగా కరోనా బాధితులు ఉన్నారని, ఈ వైరస్‌ కారణంగా 2.75 లక్షలమందికిపైగా ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. భారత్‌లో కూడా చాలామందిని మనం కోల్పోయామని, వారందరికీ తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని మోడీ చెప్పారు. పిపిఈ కిట్లు, మాస్కులు తయారీ ద్వారా స్వయం సమృద్ధి సాధించిన విషయాన్ని మోడీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అతి పెద్ద ఆపద కరోనా భారత్‌కు ఒక సందేశాన్ని తీసుకు వచ్చిందని, ఒక అవసరాన్ని కూడా తీసుకొని వచ్చిందని ప్రధాని అన్నారు. ఈ సంక్షోభం ప్రారంభమయ్యేసరికి దేశంలో ఒక్క పిపిఈ కిట్‌ కూడా తయారు కావటం లేదని, దేశంలో ఎన్‌-95 మాస్కులు కూడా నామమాత్రంగా తయారయ్యేవని గుర్తుచేశారు. ఇప్పుడు దేశంలో రెండు లక్షలపైగా పిపిఈ కిట్‌లు తయారయ్యాయని, ఇప్పుడు పిపిఈ కిట్లు, మాస్కులు తయారీ ద్వారా స్వయం సమృద్ధి సాధించామని మోడీ చెప్పారు. కరోనాపై పోరులో నాలుగునెలలకు పైగా సమయం గడిచిపోయిందని, భారత్‌లో కూడా అనేకమంది అయినవారిని కోల్పోయామని, ఒకేఒక్క వైరస్‌ ప్రపంచాన్ని తలకిందులు చేసిందన్నారు. ప్రపంచం మొత్తం ప్రాణం కోసం యుద్ధం చేస్తోందని, ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని, వినలేదని, మన పోరాట సంకల్పాన్ని మరింతగా బలపరుచుకోవాలని ప్రధాని తన ప్రసంగంలో ప్రజలకు పిలుపునిచ్చారు.

DO YOU LIKE THIS ARTICLE?