రూ.150 కోట్లు హాంఫట్‌!

‘సన్‌ పరివార్‌’ గుట్టురట్టు
‘కలిస్తే గెలుస్తాం’  పేరిట టోకరా
రూ. 14 కోట్లు సీజ్‌

ప్రజాపక్షం/ సిటీబ్యూరో : లక్ష రూపాయల పెట్టుబడితో అధిక లాభాల ఆశచూపి 150 కోట్ల రూపాయల మేర మోసాలకు పాల్పడిన ‘సన్‌ పరివార్‌’ సంస్థ గుట్టు రట్టయింది. నగర శివారులోని సంగారెడ్డి వేదికగా దేశవ్యాప్తంగా వందల మంది బాధితుల నుండి పెట్టుబడుల రూపంలో ఈ సంస్థ డబ్బుల వ సూళ్ళకు పాల్పడిందని సైబరాబాద్‌ పోలీసులు గుర్తించారు. సంస్థ యజమానిని అరెస్ట్‌ చేసి భ్యాంకు ఖాతాల్లో ఉన్న 14 కోట్ల రూపాయలను పోలీసులు సీజ్‌ చేశారు. సంస్థకు చెందిన డైరెక్టర్‌లపై కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ విసి సజ్జనార్‌ శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన మెతుకు రవీందర్‌ సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ అప్పర్‌ ప్రైమరీ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. తనకు వచ్చే జీతంతో సంతృప్తి చెందని రవీందర్‌ కొంత కాలం స్పెక్ట్రా బిల్డింగ్‌ అండ్‌ బ్లాగ్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో ఏజెంట్‌గా పార్ట్‌టైం జాబ్‌ కూడా చేశాడు. అప్పటికీ తన ఆదాయంతో రవీందర్‌ సంతృప్తి చెందక సన్‌పరివార్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ అనే సంస్థను స్థాపించాడు. ఈ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో లాభాలు ఇస్తానని ఆశ చూపించాడు. కేవలం లక్షరూపాయల పెట్టుబడితోనే సంస్థలో చేరవచ్చని నమ్మబలికాడు. తన స్నేహితులు, బంధువులను కూడా ఇందలో చేర్చుకున్నాడు. అధిక మొత్తంలో పెట్టుబడులు రాబట్టేందుకు ‘కలిస్తే గెలుస్తాం’ అనే నినాదంతో ఆన్‌లైన్‌ ప్రకటనలు చేసి పెట్టుబడి దారులను ఆకర్షించాడు
పెట్టుబడి స్కీం ఇదే : ఈ సంస్థలో లక్షరూపాయలు పెట్టుబడి పెడితే నెలకు 6వేల రూపాయల చొప్పున 25 నెలలు వరకు సంస్ధ సభ్యులకు డబ్బు చెల్లిస్తుంది. అంటే ఆ మొత్తం 1.5లక్షలుగా తిరిగి చెల్లించినట్లవుతుంది. ఇక పెట్టుబడిగా పెట్టిన లక్ష రూపాయలను కూడా 26వ నెలలో తిరిగి ఇచ్చేస్తారు. ఈ పథకం ప్రకారం లక్షరూపాయల పెట్టుబడి పెడితే 26నెలల్లో రెండింతలు అవుతుంది. సంస్థలో పెట్టుబడి పెట్టడమే కాదు అందులో పెట్టుబడి పెట్టించిన వారికి తాయిలాలు ఉంటాయి. 5లక్షల వరకు పెట్టుబడి పెట్టించిన వారికి 9 నెలల వరకు నెలకు3 శాతం చొప్పున కమీషన్‌ చెల్లిస్తారు. 5లక్షలు దాటిన వారికి 1శాతం కమీషన్‌ పెంచుతారు. అలా ఎన్ని లక్షలు పెట్టుబడి పెట్టించగలిగితే అంత ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించ వచ్చు. అంతేకాదు పెట్టుబడి టార్గెట్‌లు దాటిన వారికి గోవా, బ్యాంకాక్‌, సింగపూర్‌ ట్రిప్పులు కూడా ఉంటాయి. ఇలాంటి స్కీంలతో దేశవ్యాప్తంగా 150కోట్ల రూపాయలను పెట్టుబడిగా వసూళు చెసినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది.
ఆస్తులపై ఆరా : రవీందర్‌ ప్రజల వద్ద సూలు చేసిన డబ్బులతో సన్‌మ్చూవల్లీ ఎయిడెడ్‌ కో ఆపరేటీవ్‌ సొసైటి, సన్‌ పరివార్‌ ఉపాది మేనేజ్‌మెంట్‌, మెతుకు చిట్‌ఫండ్స్‌, మెతుకు వెంచర్స్‌, మెతుకు హెర్బల్స్‌, మెతుకు మెడికల్‌ అండ్‌ హెర్బల్‌ ఫౌండేషన్‌, మెట్‌ సన్‌ నిధి లిమిటెడ్‌ పేరిట సంస్థలు నెలకొల్పాడు. ఆ సంస్థల పేరిట వ్యాపార లావాదేవీలు నిర్వహించాడు. రవీందర్‌ ప్రజల వద్ద వసూలు చేసిన 150 కోట్లలో కేవలం 14 కోట్ల రూపాయలు మాత్రమే బ్యాంకు ఖాతాలలో లభ్యమయ్యాయి. మిగిలిన సొమ్ము ఏమైందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తను స్ధాపించిన సంస్ధల పేర ఏమైన స్ధిరాస్ధులు కొన్నాడా…? లేక సొంత పేరిట ఆస్థులు కొనుగోలు చేశాడా అనే అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
డబ్బు చెల్లించలేక గుట్టు రట్టు :రవీందర్‌ 2015వ సంవత్సరంలో ఈ సం స్థను స్థాపించాడు. అప్పటి నుండి ఎవరికీ అనుమానం రాకుండా వచ్చిన డబ్బునే తిరిగి చెల్లిస్తూ పెట్టుబడి దారులలో నమ్మకం కుదుర్చుకున్నాడు. ఒకటి రెండు సంవత్సరాలు చెల్లించాక డబ్బుల చెల్లింపు ఆపివేశాడు. అడిగిన వారిని విదేశి ట్రిప్పులతో సంతృప్తి పరిచి డబ్బు పెట్టుబడి రూపంలో క్షేమంగా ఉందని కాలం వెల్లబుచ్చాడు.రోజుల గడుస్తున్నా డబ్బులు చెల్లించక పోవడంతో నగరానికి చెందిన దుర్గాప్రసాద్‌ సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసునమోదు చేసిన పోలీసులు సంస్థ గుట్టురట్టు చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?