రాష్ట్రంలో ఒకే రోజు 75 పాజిటివ్‌ కేసులు

229కి చేరిన కేసులు
మరో ఇద్దరు మృతి, 11కి చేరిన మరణాలు
హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ కలవరపెడుతోంది. తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా విజృంభిస్తోంది. తాజాగా శుక్రవారంనాడు ఒకేరోజు 75 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ శుక్రవారం సాయంత్రం 7 గంటలకు జారీ చేసిన ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు. కొత్తగా 75 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్‌ 19 కేసుల సంఖ్య 229కి చేరింది. తాజాగా 15 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 32కి చేరింది. శుక్రవారంనాడు ఇద్దరు కరోనా రోగులు మరణించడంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 11కి చేరింది. ఆసుపత్రుల్లో ఇంకా 186 మంది చికిత్స పొందుతున్నారు. ఇదిలావుండగా, మర్కజ్‌ నుండి వచ్చిన వారందర్నీ గుర్తించామని, ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిని, వారిలో లక్షణాలు ఉన్న వారి కుటుంబసభ్యులను ఐసోలేషన్‌ సెంటర్లకు తరలించి, కరోనా పరీక్షలు చేయాల్సిందిగా సిఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఈ నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఆరు ల్యాబ్‌లలో 24 గంటలు మూడు షిఫ్టుల్లో కరోనా పరీక్షలు జరుగుతున్నాయని మంత్రి ఈటల తెలిపారు. ఈరోజు ఇద్దరు కరోనాతో మరణించారని, ఒకరు షాద్‌నగర్‌కు చెందిన వ్యక్తి కాగా, మరొకరు సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తి. వీరితో కలిసిన వారందర్నీ గుర్తిస్తున్నామని తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?