రాష్ట్రంలో ‘ఆయుశ్మాన్‌ భారత్‌’ను అమలు చేయాలి

సిఎం కెసిఆర్‌కు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ లేఖ
హైదరాబాద్‌: కోవిడ్‌–19ను కేంద్రం ఆయుశ్మాన్‌ భారత్‌లో చేర్చిన దృష్ట్యా తెలంగాణాలో కూడా ఆయుశ్మాన్‌ భారత్‌ను అమలు చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్‌ కుమార్‌ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరోన నేపథ్యంలో రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా దళారులపై చర్యలు చేపట్టాలని కోరారు. కరోనా విపత్తును ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి తమ పూర్తి సహకారం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ మేరకు బండి సంజయ్‌ మంగళవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఒక లేఖ రాశారు. రాష్ట్రంలోని లక్షలాది మంది బిజెపి కార్యకర్తలు కరోనాపై ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనడానికి సిద్ధమని తెలిపారు. ప్రతి బిజెపి కార్యకర్త కరోనా వ్యతిరేక సేవకుడిగా సేవలందించాలని ఆయన కోరారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఈ క్లిష్ట పరిస్థితులలో, అన్ని సంస్థలు, ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు సమిష్టిగా కృషి చేసి, భయంకర కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య అధికంగా పెరిగినట్లైతే హైదరాబాద్‌లో ఖాళీగా ఉన్న సెక్రటేరియట్‌ను ఐసోలేషన్‌ కేంద్రంగా ఉపయోగించాలని బండి సంజయ్‌ కుమార్‌ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ట్విట్టర్‌ ద్వారా క సందేశాన్ని పంపారు.

DO YOU LIKE THIS ARTICLE?