రాయలసీమ ప్రాజెక్టుతో శ్రీశైలం ఖాళీ?

ఎపి చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే కృష్ణానదిపై తెలంగాణలో వేల కోట్లతో నిర్మిస్తున్న ప్రాజెక్టులు వృథా
ప్రజాపక్షం/మహబూబ్‌నగర్‌ బ్యూరో కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజల అవసరాలను విస్మరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే కృష్ణానదిపై నిర్మించిన శ్రీశైలం బహుళార్థ సాధక ప్రాజెక్టు ఖాళీ అయ్యే పరిస్థితులు ఏర్పడనున్నాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించి ఏదో ఒక నిర్ణ యం తీసుకోనట్లయితే ఇరు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు తప్పవని జల వనరుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన తీవ్ర అన్యాయానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమ ఫలితమే ప్రత్యే క తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఎపి జల వనరుల దోపిడీ మాత్రం ఆగలేదు. తెలంగాణలోని కల్వకుర్తి ప్రాజెక్టుకు శ్రీశైలంలో 800 అడుగుల నుంచి నీటిని తరలించుకుపోతున్నారని, ఎపి ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో నీటిని తరలించేందుకు పనులను ముమ్మరం చేసింది. ఎలాంటి డిపిఆర్‌ లేకుండానే చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథ కం పనులు 30 శాతం పూర్తి కావచ్చాయి. పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కులకు బదులు 88 వేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు అవసరమైన అప్రోచ్‌ కాలువ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. కృష్ణానది యాజమాన్య బోర్డు, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌, సెంట్రల్‌ వాటర్‌బోర్డు వంటి కేంద్ర ప్రభుత్వ శాఖల ఆదేశాలను సైతం పట్టించుకోకుండా ఇరు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధానికి తెర తీస్తున్నారు. కేటాయింపులకు లోబడి నీటిని తరలిస్తున్నామని ఎపి ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు 848 అడుగుల లోతు నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని తీసుకువెళుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే ముచ్చుమర్రి, హంద్రీ-నీవా నుంచి రాయలసీమలోని నాలుగు జిల్లాలకు నీటిని తరలిస్తున్నారు. అలాగే ప్రతి ఏడాది వర్షాకాలంలో 25 రోజుల పాటు ప్రవహించే వరద జలాలను వాడుకుంటామనే సాకుతో సంగమేశ్వరం నుంచి పోతిరెడ్డిపాడు వరకు 17 కిలోమీటర్ల పొడవున 800 అడుగుల నుంచి 88 వేల క్యూసెక్కుల నీటిని అక్రమంగా ఎత్తిపోస్తున్నారు. పోతిరెడ్డిపాడుకు ఎలాంటి సంబంధం లేకుండా ఎఆర్‌ఎంసిలోకి నీటిని తోడేందుకు చేస్తున్న పెద్ద కుట్రలో భాగమే రాయలసీమ ఎత్తిపోతల పథకమని నిపుణులు అంటున్నారు. శ్రీశైలం వెనుక జలాల నుంచి ముచ్చుమర్రి ఎత్తిపోతల పేరుతో కెసి కెనాల్‌లోకి వరద నీటిని ఎత్తిపోసుకుని బనకచర్ల క్రాస్‌ కాంప్లెక్స్‌ ద్వారా కృష్ణా జలాలను ఎపి దోచుకుంటుందని జల వనరుల నిపుణులు చెబుతున్నారు. శ్రీశైలానికి ఎగువన 25 కిలోమీటర్ల వద్ద నల్లమలలో భీముని కొలను భూగర్భ సొరంగ మార్గం ద్వారా 43 టిఎంసిల నీటిని ప్రకాశం జిల్లాకు తరలించే వెలిగొండ ప్రాజెక్టు పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు కోసం శ్రీశైలం జలాశయంలో 860 అడుగుల నీటి మట్టం నుంచి కృష్ణా జలాలను తరలించేందుకు ఎపి సిద్ధమైంది. దీంతో శ్రీశైలం వెనుక జలాల నుంచి వరద జలాలు, మిగులు జలాలు, ట్రిబ్యునల్‌ కేటాయింపు జలాలను నాలుగు వేర్వేరు కెనాల ద్వారా రాయలసీమకు తరలించేందుకు ఎపి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం దీనికి కేటాయించిన 144 టిఎంసిల నీటిని తరలిస్తున్నామని చెబుతున్నప్పటికీ నాలుగు వేర్వేరు కెనాళ్ల ద్వారా ఏడాదికి 250 టిఎంసిలకు పైగా వరద నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. నీటి ప్రవాహాన్ని కొలిచే టెలిమెట్రి పరికరాలను కూడా ధ్వంసం చేసి అక్రమంగా నీటి చౌర్యానికి పాల్పడుతున్నారు. 2014 ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం కృషా నీటిలో వాటాలను నిర్ధారించారు. 881 టిఎంసిల నీటిలో 66:34 నిష్పత్తిలో జలాలను వాడుకోవాలని కృష్ణా జలాల యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి) స్పష్టం చేసింది. అయితే రాయలసీమ ప్రాంతం వెనుకబాటుకు గురైందనే సాకుతో కృష్ణా జలాలను తరలించేందుకు భారీ ఎత్తున ప్రాజెక్టులను ఎపి ప్రభుత్వం చేపట్టింది. దీంతో కృష్ణానదిపై తెలంగాణ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న ప్రాజెక్టులు వృథాగా మారే పరిస్థితులు ఉన్నాయి. ఎపి ప్రభుత్వం చేపట్టే అక్రమ ప్రాజెక్టుల కారణంగా శ్రీశైలంలో చుక్కనీరు రాకుండా తలెత్తే పరిస్థితులు ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గెజిట్‌తో కూడా తెలంగాణకు అన్యాయమే జరుగుతుందని నిపుణులు అంటున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?