రాణించిన కెఎల్‌ రాహుల్‌

మెరిసిన ఆర్చర్‌, రాజస్థాన్‌ లక్ష్యం 183
మొహాలీ: ప్రపంచకప్‌ భారత జట్టులో స్థానం దక్కించుకున్న కెఎల్‌ రాహుల్‌ ఐపిఎల్‌లోనూ తన సత్తా చాటుకున్నాడు. మంగళవారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్‌ (52; 47 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. దీంతో మొదట బ్యాటింగ్‌ చేసిన కింగ్స్‌లెవన్‌ పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ తొలుత పంజాబ్‌కు బ్యాటింగ్‌కు అహ్వానించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ ఆదిలోనే ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ (30; 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు)ను కోల్పోయింది. తర్వాత వచ్చిన మయాంక్‌ అగర్వాల్‌ విజృంభించి ఆడుతూ 12 బంతుల్లోనే 26 పరుగులు చేసి ఆర్చర్‌కే చిక్కాడు. దీంతో కింగ్స్‌లెవన్‌ 67 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. తర్వాత రాహుల్‌, డేవిడ్‌ మిల్లర్‌ ఇద్దరూ కలిసి పంజాబ్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. రాజస్థాన్‌ బౌలర్లపై విరుచుకుపడి వేగంగా పరుగులు సాధించారు. ఆరంభంలో కుదురుగా ఆడిన రాహుల్‌ తర్వాత జోరును పెంచాడు. అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు సాధిస్తూ సోరుబోర్డును ముందుకు నడిపించాడు. ఈక్రమంలోనే రాహుల్‌ 45 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత మరో రెండు పరుగులు మాత్రమే జోడించి ఉనద్కాట్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మరోవైపు చెలరేగి ఆడిన మిల్లర్‌ (40; 27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేసి వెనుదిరిగాడు. ఇక ఆఖర్లో పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 4 బంతుల్లోనే రెండు సిక్సులు, ఒక ఫోర్‌తో అజేయంగా 17 పరుగులు చేయడంతో పంజాబ్‌ 20 ఓవర్లలో 182/6 పరుగులు చేసింది. రాజస్థాన్‌ బౌలర్లలో మరోసారి ఆకట్టుకున్న జోఫ్రా ఆర్చర్‌ నాలుగు ఓవర్లలో 15 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

DO YOU LIKE THIS ARTICLE?