రాజస్థాన్‌కు చివరి అవకాశం

గెలిస్తేనే ముందుకు
నేడు ముంబయితో పోరు
సాయంత్రం 4 గంటల నుంచి స్టార్‌ నెట్‌వర్క్‌లో ప్రసారం
జైపూర్‌: ఐపిఎల్‌ సీజన్‌ ఇప్పటికే సగం మ్యాచ్‌లు ముగిసి పోయాయి. కొన్ని జట్లు టాప్‌ స్థానాల కోసం పోటీ పడుతుంటే మరికొన్ని జట్లు కనీసం నాకౌట్‌కు అర్హత సాధిస్తే చాలనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు కూడా పేలవమైన ఆటతో నిరాశ పరుస్తూ నాకౌట్‌ ఆశలను క్లిష్ట పర్చుకోంటుంది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్‌ జట్టు కేవలం రెండు మ్యాచుల్లోనే నెగ్గింది. మిగతా ఆరు మ్యాచుల్లో ఘోర పరాజయాలను చవిచూసింది. దాంతో ఈ జట్టు పాయింట్ల పట్టికలో క్రింది నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఇక ఇక్కడి నుంచి ప్రతి మ్యాచ్‌లో నెగ్గుకుంటూ వస్తే ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవచ్చు. అందుకే ఇప్పటి నుంచి ఆర్‌ఆర్‌కు ప్రతి మ్యాచ్‌ కీలకంగా మారింది. మిగిలిన ఆరు మ్యాచుల్లో వరుసగా విజయాలు సాధిస్తే ఈ జట్టు తర్వాతి స్టేజ్‌కు అర్హత సాధించవచ్చు. లేదంటే ఐదులో గెలిచి ఒక మ్యాచ్‌లో ఓడితే అ ప్పుడు రన్‌రేట్‌ ఆధారంగా నాకౌట్‌కు చేరుకునే చాన్స్‌ ఉంటుంది. కానీ, ఈ లాంటి పరిస్థితుల్లో రాజస్థాన్‌ రాయల్స్‌కు వరుస విజయాలు సాధించడం పెద్ద సవాలనే చెప్పాలి. శనివారం తమ సొంత మైదానంలో పటిష్టమైన ముంబయి ఇండియన్స్‌తో రాజస్థాన్‌ జట్టు తలపడనుంది. ఒకవైపు రాజస్థాన్‌ పాయింట్ల పట్టికలో క్రింది నుంచి రెండో స్థానంలో ఉంటే.. మరోవైపు ముంబయి ఇండియన్స్‌ పై నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన ముంబయి ఆరింట్లో విజయాలు సాధించి మూడు మ్యాచుల్లో ఓటములను ఎదుర్కొంది. ప్రస్తుతం 12 పాయింట్లతో సెకండ్‌ ప్లేస్‌లో నిలిచింది. వారి కంటే ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ 14 పాయింట్లతో టోర్నీ టాపర్‌గా ఉంది. ఇక శనివారం జైపూర్‌ వేదికగా జరిగే మ్యాచ్‌లో ముంబయి విజయం సాధిస్తే చెన్నైను వెనుకకు నెట్టి ఈ జట్టు నెంబర్‌ వన్‌ స్థానం కైవసం చేసుకుంటుంది. ప్రస్తుతం చెన్నై కంటే ముంబయి రన్‌రేట్‌ బాగుంది. అందుకే ఈ మ్యాచ్‌ను ఇరు జట్లు సవాల్‌గా తీసుకున్నాయి. ఒక జట్టు మ్యాచ్‌ను ఎలాగైన గెలిచి నాకౌట్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలనుకుంటుంటే.. మరోవైపు ఇంకో జట్టు ఈ మ్యాచ్‌ను నెగ్గి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానం అందుకోవాలని భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌ జైపూర్‌లో జరుతుండడం రాజస్థాన్‌ రాయల్స్‌కు కలిసొచ్చే అంశం. ఎందుకంటే తమ హోమ్‌గ్రౌండ్స్‌లో ఆర్‌ఆర్‌ జట్టు పటిష్టంగానే ఉంది. ఇక నుంచి వారికి ప్రతి మ్యాచ్‌ కీలకం కావడంతో మరింతగా చెలరేగి ఆడే అవకాశంప ఉంది. మరోవైపు ముంబయి కూడా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. శనివారం సాయంత్రం జరిగే ఈ మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి.
కలిసికట్టుగా రాణిస్తేనే..
పటిష్టమైన ముంబయి ఇండియన్స్‌తో ఈ రోజు జరిగే మ్యాచ్‌లో ఆతిథ్య రాజస్థాన్‌ జట్టు కలిసికట్టుగా రాణిస్తేనే విజయం సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆర్‌ఆర్‌లో కొందరు బ్యాటింగ్‌లో మరికొందరు బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శనలు చేస్తున్నారు. కానీ అందరూ మాత్రం ఒకజట్టుగా ఆడటంలో విఫలమవుతున్నారు. బ్యాటింగ్‌లో జోస్‌ బట్లర్‌, రాహుల్‌ త్రిపాఠి, కెప్టెన్‌ రహానే, సంజూ శాంసన్‌ పర్వాలేదనిపిస్తున్నా.. వీరు అన్ని మ్యాచుల్లో రాణించలేక పోతున్నారు. బట్లర్‌ ఒక్కడే నిలకడమైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిస్తున్నాడు. దూకుడుగా ఆడుతున్న బట్లర్‌ 8 మ్యాచుల్లో (311) పరుగులు చేశాడు. అందులో మూడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అత్యధికంగా (89) పరుగులు చేశాడు. మరోవైపు రాహుల్‌ త్రిపాఠి, సంజూ శాంసన్‌, అజింక్యా రహానేలు అప్పుడప్పుడు బ్యాట్‌ను ఝుళిపిస్తున్నారు. కానీ, ఒకరు రాణిస్తే మరోకరు చేతులెత్తేస్తున్నారు. దాంతో మ్యాచ్‌ ఫలితం తేలిపోతోంది. రాజస్థాన్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్న జట్టు సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఈ సీజన్‌లో ఘోరంగా విఫలమవడం ఆర్‌ఆర్‌ను కలవరపెడుతోంది. గత ఏడాది బాల్‌ ట్యాంపరింగ్‌ కారణంగా ఐపిఎల్‌కు దూరమైన స్మిత్‌ ఈ సారి అవకాశం లభించిన తన స్థాయికి తగ్గట్టు రాణించలేక పోతున్నాడు. అతని బ్యాటింగ్‌ ఎంత దారుణంగా ఉందంటే.. పంజాబ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో రాజస్థాన్‌ యాజమాన్యం సిత్‌ను ఆడించకుండా పక్కనపెటేసింది. అతని స్థానంలో ఆసీస్‌ యువ ఆల్‌రౌండర్‌ ఆస్టన్‌ టర్నర్‌ను తుది జట్టులో చోటు కలిపించారు. అయినా ఆ మ్యాచ్‌లోనూ రాజస్థాన్‌కు ఓటమి తప్పలేదు. చివరి వరకు గట్టిగా పోరాడిన రాజస్థాన్‌ రాయల్స్‌ ఆఖరికి 12 పరుగుల స్వల్ప తేడాతో పంజాబ్‌ చేతిలో ఓడింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌ఆర్‌ బ్యాట్స్‌మెన్‌లు ఆకట్టుకున్నారు. ఇక బౌలింగ్‌ విషయానికి వస్తే ఇంగ్లాండ్‌ యువ ఆల్‌రౌండర్‌ జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో ఇరగదీస్తున్నాడు. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి జట్ల బ్యాట్స్‌మెన్‌లను హడలెత్తిస్తున్నాడు. పొదుపుగా బౌలింగ్‌ చేస్తూ కీలక వికెట్లు పడగొడుతున్నాడు. ఇతనికి తోడుగా ఇతర బౌలర్లు నిలిస్తే రాజస్థాన్‌ను అడ్డుకోవడం కష్టమనే చెప్పాలి. బ్యాట్స్‌మెన్‌లు, బౌలర్లు అందరూ కలిసికట్టుగా చెలరేగితే రాజస్థాన్‌ విజయానికి అడ్డు ఉండదు.
అగ్ర స్థానం కోసం పోటీ..
మరోవైపు వరుస విజయాలతో జోరుమీదున్న ముంబయి ఇండియన్స్‌ మరో విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో ప్రస్తుతం అగ్ర స్థానంలో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ను వె నకకు నెట్టి ముందు స్థానం కైవసం చేసుకుంటుంది. అందుకే శనివారం రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌ ముంబయికి కీలకంగా మారింది. ఇప్పటికే 12 పాయింట్లతో నాకౌట్‌ స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకున్న రోహిత్‌ సేన మరో రెండు విజయాలు సాధిస్తే చాలు. ఈ సీజన్‌లో ముంబయి జట్టు ఆల్‌రౌండ్‌ షోలతో ఆదరగొడుతోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లో ఈ జట్టు మెరుగ్గా ఆడుతోంది. గురువారం జరిగిన తమ చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 40 పరుగులతో చిత్తు చేసింది. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సిబిపై 5 వికెట్లతో గెలిచి అదే జోరును తర్వాతి మ్యాచ్‌లోను ప్రదర్శించింది. ప్రస్తుతం ముంబయి బ్యాటింగ్‌ విభాగంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, డి కాక్‌, సుర్య కుమార్‌ యాదవ్‌, కీరణ్‌ పొలార్డ్‌లు మంచి ఉన్నారు. మరోవైపు ఆల్‌రౌండర్లు హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్యలు సైతం బ్యాటింగ్‌లో విజృంభించి ఆడుతుండడం ఎమ్‌ఐకు కలిసివస్తోంది. ఇక బౌలింగ్‌లో జస్ప్రీత్‌ బుమ్రా, లసిత్‌ మలింగ, దీపక్‌ చాహర్‌, కృనాల్‌, హార్దిక్‌లు ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపెడుతున్నారు. అందుకే ముంబయిను ఓడించడం ఇతర జట్లకు కష్టంగా మారుతోంది. ఒకరు విఫలమైతే మరొకరు జట్టుకు అండగా నిలిస్తూ జట్టుకు గొప్ప విజయాలు అందిస్తున్నారు. టైటిల్‌ ఫేవరేట్‌గా ఉన్న ముంబయిను ఎదుర్కొవడం ఇతర జట్లకు సవాలేనని చెప్పాలి. శనివారం జరిగే మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ జట్టు విజయమే లక్ష్యంగా బరిలో దిగుతోంది.

పంజాబ్‌తో ఢిల్లీ ఢీ
నేడు ఇరు జట్ల మధ్య కీలక మ్యాచ్‌
రాత్రి 8 గంటల నుంచి స్టార్‌ నెట్‌వర్క్‌లో ప్రసారం
న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్‌, కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ జట్ల మధ్య శనివారం రాత్రి 8 గంటల నుంచి కీలక మ్యాచ్‌ జరగనుంది. ఐపిఎల్‌ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శనలు చేస్తున్న ఈ రెండు జట్లు సమాఉజ్జీలుగా ఉన్నాయి. చెరో 9 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్‌, ఢిల్లీ జట్లు తలో 5 విజయాలతో సమానంగా నిలిచాయి. అయితే రన్‌రేట్‌ పరంగా మెరుగ్గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ మూడో స్థానం దక్కించుకుంటే.. పంజాబ్‌ లెవన్‌ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టుకు రెండు పాయింట్లతో పట్టికలో మరింతగా పైకి వెళ్లే అవకాశం ఉంది. పంజాబ్‌ తమ చివరి మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై 12 పరుగులతో విజయం సాధిస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ చివరి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ చేతిలో భారీ పరజాయాన్ని చవిచూసింది. కానీ ఢిల్లీ జట్టును తక్కువ అంచనా వేయలేం. గత మ్యాచ్‌లో ముంబయితో ఓడినా అంతకుముందు వారి ప్రదర్శనలు మెరుగ్గా ఉన్నాయి. బలమైన జట్లను చిత్తు హ్యాట్రిక్‌ విజయాలతో చేస్తూ పాయింట్స్‌ మూడో స్థానంకు చేరుకుంది. ఢిల్లీలో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌తో పాటు శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షా, కొలిన్‌ మున్రో, రిషభ్‌ పంత్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. బ్యాట్‌తో నిలకడగా రాణిస్తూ జట్టు విజయాల్లో తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఇక బౌలింగ్‌లో కసిగో రబడా టోర్నీలో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు (19) సాధించిన బౌలర్‌గా పర్పుల్‌ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఇతనితో పాటు ఇషాంత్‌ శర్మ, క్రిస్‌ మోరీస్‌, అమిత్‌ మిశ్రా, అక్సర్‌ పటేల్‌, కీమో పౌల్‌లు బంతితో తమ సత్తా చాటుతున్నారు. జట్టులో అందరూ నిలకడగా రాణిస్తుండడం ఢిల్లీకి కలిసోస్తుంది. మరోవైపు పంజాబ్‌ సైతం ఈ సీజన్‌లో ఆకట్టుకోంటుంది. అన్ని విభాగాల్లో పంజాబ్‌ పటిష్టంగా ఉంది. ప్రపంచ అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లతో పాటు టాప్‌ క్లాస్‌ బౌలర్లు ఈ జట్టుకు సొంతం. అందుకే కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ ఈసారి మెరుగైన ప్రదర్శనలతో మైమరపిస్తోంది. ఇక పంజాబ్‌, ఢిల్లీ జట్లు తమ తమ విభాగాల్లో పటిష్టంగా ఉండడంతో శనివారం న్యూఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో ఈ జట్ల మధ్య జరిగే పోరు ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌ హోరాహోరీగా జరగడం ఖాయమనిపిస్తోంది.

DO YOU LIKE THIS ARTICLE?