రచ్చకెక్కకండి!

నాలుగు గోడల మధ్యనే సమస్యలు పరిష్కరించుకుందాం
కార్యకర్తలు ఎక్కువైనందున పెరిగిన పదవుల పోటీ
టిఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభలో కెటిఆర్‌

ప్రజాపక్షం/ హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌లో కార్యకర్తల సంఖ్య ఎక్కువైనందున పదవులకు పోటీ ఉన్న నేపథ్యంలో రచ్చకెక్కకుండా నాలుగు గోడల మధ్య మాట్లాడుకుని సమన్వయంతో ముందుకు సాగాలని టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటి.రామారావు పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రజలు తమపై ఎంతో నమ్మకంతో మరోసారి అవకాశం కల్పించారని, రచ్చకెక్కి వారి నమ్మకా న్ని వమ్ము చేయకూడదన్నారు. అవకాశం కోసం ప్రతిపక్షాలు గోతికాడి నక్కల్లా ఎదురుచూస్తున్నాయని, ఎలాంటి సమస్యలు, పరిస్థితులనైనా ఎదుర్కొనే సత్తా కెసిఆర్‌కు ఉన్నదని, చాణక్య నీతి గల కెసిఆర్‌ వాటిని పరిష్కరిస్తారని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో గులాబీ జెండాను కెటిఆర్‌ ఆవిష్కరించారు. అనంత రం కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల తర్వాత ఆవిర్భావ వేడుకలను ఆడంబరంగా జరుపుకుందామన్నారు. ప్రభుత్వం, ప్రజలకు మధ్య పార్టీ వారథిగా పనిచేయాలని, సిఎం కెసిఆర్‌ సందేశాన్ని క్షేత్రస్థాయిలోని ప్రజలకు వద్దకు తీసుకెళ్లాలన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు జిల్లా పార్టీ కార్యాలయాలను నిర్మాంచుకోవాలని, బూత్‌స్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం  చేసుకోవాలన్నారు. పార్టీలోని కొత్త, పాత వారికి పదవులు కల్పించుకోవాల్సిన అసవరం ఉందన్నారు. కెసిఆర్‌ టిఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేసి ఒక దుస్సాహసం చేశారన్నారు. ఎంచుకున్న లక్ష్యంలో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో పాటు రెండు సార్లు సిఎం అయిన ఘనత కెసిఆర్‌కే సొంతమన్నారు. తెలుగు ప్రజల కోసం పార్టీ పెట్టి విజయం సాధించింది ఇద్దరే నాయకులని, ఇందులో ఒకరు ఎన్‌టిఆర్‌, మరొకరు కెసిఆర్‌ అని గుర్తు చేశారు. అప్పటి రాజకీయ శూన్యతతో పాటు ఎన్‌టిఆర్‌కు సినీ నటుడిగా ఉన్న గ్లామర్‌ కారణమని, అదే కెసిఆర్‌కు బలమైన సామాజిక నేపథ్యం లేదని, ఆర్థిక వనరులు లేకున్నా విజయం సాధించారన్నారు. కెసిఆర్‌ పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదన్నారు .

DO YOU LIKE THIS ARTICLE?