రక్తమార్పిడి ద్వారా గర్భిణీకి హెచ్‌ఐవి

బ్లడ్‌బ్యాంకుల స్టాకుల స్క్రీనింగ్‌కు తమిళ ప్రభుత్వం ఉత్తర్వులు
విరుధునగర్‌ (తమిళనాడు): ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది రక్తంను స్క్రీనింగ్‌ చేయకుండానే 24 ఏళ్ల గర్భిణీకి రక్తమార్పిడి ద్వారా హెచ్‌ఐవిని అంటించిన ఘటన తమిళనాడు విరుధునగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విరుధునగర్‌ జిల్లాకు చెందిన ఓ గర్భిణి చికిత్స నిమిత్తం సత్తూర్‌ ప్రభుత్వాస్పత్రిలో చేరారు. ఆమెకు రక్తం అవసరమవ్వడంతో డిసెంబరు 3న శివకాశి ప్రభుత్వాసుపత్రి నుంచి తెప్పించి ఎక్కించారు. ఈ రక్తాన్ని దానం చేసిన వ్యక్తి ఇటీవల ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా విదేశాలకు వెళ్లేందుకు వైద్యపరీక్షలు చేయించుకున్నాడు. ఆ పరీక్షల్లో అతడికి హెచ్‌ఐవి ఉన్నట్లు తేలిం ది. దీంతో అతడు శివకాశి ప్రభుత్వాసుపత్రికి వెళ్లి రక్తదాన రిపోర్టును అడిగారు. అందులోనూ అతడికి హెచ్‌ఐవి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వెంటనే అక్క డి సిబ్బంది సత్తూర్‌ ప్రభుత్వాస్పత్రికి సమాచారమిచ్చారు. అప్పటికే ఆ రక్తాన్ని సదరు గర్భిణీకి ఎక్కించడంతో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైరస్‌ ఉన్న రక్తాన్ని ఎక్కించడంతో ఆమెకు కూడా హెచ్‌ఐవి సోకింది. దీంతో ఆమె, ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిపై కేసు పెట్టారు. దీనికంతటికీ తమిళనాడు ప్రభుత్వానిదే బాధ్యత అని ఆమె భర్త విలేకరులకు చెప్పారు. తనకేమి ప్రభుత్వ ఉద్యోగం అవసరంలేదని, కానీ తన భార్యకు మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్‌ చేశారు.
రక్తం దానం చేసినప్పుడు శివకాశి ప్రభుత్వాస్పత్రిలోని సిబ్బంది హెచ్‌ఐవి పరీక్షలు చేయలేదని, అందుకే ఈ తప్పిదం జరిగిందని అధికారులు తెలిపారు. ఘటనకు బాధ్యులైన ఇద్దరు ల్యాబ్‌ సిబ్బంది,ఓ కౌన్సిలర్‌ను సస్పెం డ్‌ చేసినట్లు ఆరోగ్య మంత్రి సి విజయభాస్కర్‌ బుధవారం చెప్పారు. వైరస్‌ సోకిన గర్భిణీకి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఆమె కడుపులో ఉన్న బిడ్డకు హెచ్‌ఐవి ఉందా లేదా అన్నది శిశువు జన్మించిన తర్వాతే తెలుస్తుందన్నారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి జె రాధాకృష్ణన్‌ విరుధునగర్‌ జిల్లాను సందర్శించి ఆ గర్భిణీతో మాట్లాడారు. జిల్లా కలెక్టరు రెవెన్యూ డివిజన్‌ అధికారి ద్వారా ఆమె కుటుంబంపట్ల పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసినట్లు మత్స్య శాఖ మంత్రి డి జయకుమార్‌ చెప్పారు.

DO YOU LIKE THIS ARTICLE?