రంజీ ఫైనల్లో విదర్భ

చెలరేగిన ఉమేశ్‌యాదవ్‌, సెమీస్‌లో కేరళ చిత్తు
వాయనాడ్‌ (కేరళ) : దేశవాలి ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ విదర్భ దూసుకెళ్లింది. కేరళతో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ (5/31) మరోసారి చెలరేగడంతో కేరళ రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులకే కుప్పకూలిం ది. అంతకుముందు కేరళ మొదటి ఇన్నింగ్స్‌లో 108 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టిన ఉమేశ్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ 5 వికెట్లతో సత్తా చాటుకున్నాడు. 68 ఏళ్ల ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ చరిత్రలో తొలి సారి సెమీస్‌కు చేరిన కేరళ జట్టు ఆశలపై భారత పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ నీరుగార్చాడు. రెండు ఇన్నింగ్స్‌లలో ఉమేశ్‌ 72 పరుగులిచ్చి మొత్తం 12 వికెట్లు పడగొట్టాడు. శుక్రవారం రెండో రోజు 171/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో బ్యా టింగ్‌ ఆరంభించిన విదర్భ (52.4 ఓవర్లలో) 208 పరుగులకు ఆలౌటైంది. దీంతో విదర్భకు 102 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. విదర్భలో కెప్టెన్‌ ఫైజల్‌ (75) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కేరళ బౌలర్లలో సందీప్‌ వారియర్‌ 5 వికెట్లు పడగొట్టగా.. బాసిల్‌ థంపీ 3 వికెట్లు దక్కించుకున్నాడు. నిదీష్‌కు రెండు వికెట్లు లభించాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌కు దిగిన కేరళ జట్టు ఉమేశ్‌ యాదవ్‌ (5/31), యష్‌ ఠాకుర్‌ (4/28) ధాటికి (24.5 ఓవర్లలో) 91 పరుగులకే కుప్పకూలింది. దీంతో విదర్భకు ఇన్నింగ్స్‌ 11 పరుగులతో ఘన విజయం దక్కింది. కేరళ బ్యాట్స్‌మెన్స్‌లో ఓపెనర్‌ అరుణ్‌ కార్తిక్‌ (36), విష్ణు వినోద్‌ (15), జోసెఫ్‌ (17) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్స్‌ రెండంకెల స్కోరు మార్కును కూడా దాటలేక పోయారు. ఈ విజయంతో విదర్భ వరుసగా రెండో సారి ఫైనల్‌కు చేరింది.

DO YOU LIKE THIS ARTICLE?