యుపిఎను చీల్చేందుకు కెసిఆర్‌ కుయుక్తి!

ఒక్క ఎన్‌డిఎ భాగస్వామినైనా కలిశారా?
బిజెపికి పూర్తిస్థాయిలో తెలంగాణ సిఎం తోడ్పాటు
మీడియా సమావేశంలో సురవరం సుధాకరరెడ్డి

ప్రజాపక్షం/హైదరాబాద్‌ : ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో తెలంగాణ సిఎం కెసిఆర్‌ కేవలం యుపిఎకు అనుకూలంగా ఉన్న పార్టీలను కలుస్తూ యుపిఎను చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని, తద్వారా బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. బిజెపికి చెందిన ఎన్‌డిఎ కూటమి పార్టీలను ఎందుకు కలవడం లేదని ప్రశ్నించారు. ఫెడరలిజం పేరుతో చక్కెర్లు కొడుతున్న కెసిఆర్‌ సమాఖ్య (ఫెడరల్‌) స్ఫూర్తితో రాష్ట్రాల హక్కుల కోసం పోరాడిన అకాళీదళ్‌ను కూడా కలవలేదని దుయ్యబట్టారు. గడిచిన ఐదేళ్ళలో కెసిఆర్‌ బిజెపిని విభేదించిన ఒక్క సంఘటన లేదని గుర్తుచేశారు. మగ్ధూంభవన్‌లో సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ, కార్యవర్గ సభ్యులు సయ్యద్‌ అజీజ్‌ పాషా, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిలతో కలిసి గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి, కూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ రాకపోవచ్చని సురవరం అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ పార్టీలన్నీ కలిసినా కాంగ్రెస్‌, బిజెపి కూటములు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవన్నారు. రాజ్యాం గ పరిరక్షణ, లౌకివాదాన్ని కాపాడుకోడానికి బిజెపియేతర ప్రభుత్వ ఏర్పాటుకు కృషిచేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు ప్రాంతీయ, లౌకిక పార్టీలు మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. కెసిఆర్‌ కూడా బిజెపి వ్యతిరేక ప్రభుత్వానికి మద్దతివ్వాలని కోరారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచార సభల్లో చోటుచేసుకుంటున్న హింసను తీవ్రంగా ఖండించారు. ఈ పరిస్థితులకు బిజెపి, తృణముల్‌ కాంగ్రెస్‌ రెండూ కారణమని విమర్శించారు. ప్రముఖ సంఘ సంస్కర్త విద్యాసాగర్‌ విగ్రహం పగులగొట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది బెంగాల్‌ సంస్కృతిని అవమానించడమేనన్నారు. ఈ హింసను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల కమిషన్‌ ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేయడం దారుణమన్నారు. మో డీ, అమిత్‌ షా ప్రచార కార్యక్రమాలన్నీ ముగియడంతో చివరి రోజు ఇతర పార్టీల రోడ్‌షోలు, సభలు ఉన్నా ప్రచారాన్ని రద్దు చేయడం జరిగిందని, ఎన్నికల కమిషన్‌ బిజెపి కనుసన్నల్లో పనిచేస్తోందని విమర్శించారు. ఎన్నికల కమిషన్‌ విశ్వసనీయతను కోల్పోయిందన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?