యుద్ధం ఆరంభమే మన చేతుల్లో… అంతం కాదు!

ఇస్లామాబాద్‌: భారతీయ మిగ్‌ యుద్ధ విమానాలను కూల్చేసి, ఇద్దరు పైలట్లను పట్టుకున్నామని పాకిస్థాన్‌ చెప్పిన నేపథ్యంలో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ‘తప్పుడు అంచనాలతో’ దుస్సాహసం చేయొద్దని హెచ్చరించారు. రెం డు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌ జాతినుద్దేశించి చేసిన టెలివిజన్‌ ప్రత్యక్ష ప్రసారంలో ‘యుద్ధం అంటూ మొదలైతే అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. తర్వాత అది నా చేతుల్లోగానీ, ప్రధాని నరేంద్ర మోడీ చేతుల్లోగానీ ఉండదు’ అన్నారు. పుల్వామా ఘటనపై ఆధారాలు ఇవ్వాలని పలుసార్లు భారత్‌కు విజ్ఞప్తి చేశామని తెలిపా రు. ‘మా భూభాగంలోకి మీరు వచ్చారు.. మీ భూభాగంలోకి మేం వచ్చాం’ అని భారత వా యుసేన దాడి, అందుకు పాక్‌ బుధవారం చేపట్టిన దాడులను ప్రస్తావించారు. పుల్వామా, ఇతర అంశాలపై భారత్‌తో తాము చర్చకు సిద్ధమన్నారు. ‘వారి రెండు మిగ్‌ విమానాలను కూల్చేశాం. వారి ఇద్దరు పైలట్లు మా వద్ద ఉన్నారు’ అని చెప్పారు. న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాకిస్థాన్‌ వాయుసేన భారత్‌లోని మిలటరీ స్థావరాలను లక్ష్యం చేసుకుందని, కానీ వారి యత్నాన్ని విఫలం చేశామని, మన పైలట్‌ ఒకరు గల్లంతయ్యారు అని తెలిపిన కొన్ని నిమిషాలకే ఇమ్రాన్‌ఖాన్‌ ఈ విషయం చెప్పారు. అన్ని యుద్ధాలు తప్పుడు అంచనాలతోనే మొదలయ్యాయని, యుద్ధాల కారణంగా అనేక మం ది ప్రాణాలు పోయాయని అన్నారు. యుద్ధం చివరికి ఎలా ముగుస్తుంది, ఏ మలుపులు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరన్నారు. ఇరుపక్షాలు తెలివితో వ్యవహరించాల్సి ఉందన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?