యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జలాశయాలకు ముప్పు

హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ జలాశయాల నుంచి 10 కిలోమీటర్ల వరకు నిర్మాణాలపై ఆంక్షలు ఉన్నా ఆగని నిర్మాణాలు పట్టించుకోని అధికార యంత్రాంగం

ప్రజాపక్షం/హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహా నగరానికి తాగునీరందించే ప్రధాన జలాశయాలకు ముప్పు పొంచి ఉందా..? అంటే ఔననే అంటున్నారు పర్యావరణ వేత్తలు. ప్రధాన జలాశయాలైన హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ క్యాచ్‌మెంట్‌ ఏరియాల్లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా అధికార యంత్రాంగం చోద్యం చూస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జంట జలాశయాలైన హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ క్యాచ్‌మెంట్‌ ఏరియా జలాశయాల నుంచి 10 కిలోమీటర్ల వరకు నిర్మాణాలపై ఆంక్షలు విధించారు. రెసిడెన్షియల్‌ జోన్‌లో ఆవాసాల నిర్మాణాలకు అనుమతిస్తారు. అయితే జలాశయాల్లోకి నీరు వెళ్లే మార్గాలకు ఎలాంటి ఆటంకాలు కల్పించకూడదనే షరతులు విధించారు. అప్పడే నిర్మాణాలకు అనుమతించడం జరుగుతుంది. క్యాచ్‌మెంట్‌ ఏరియాలో వచ్చే గ్రామాల్లో నివాస గృహాల నిర్మాణాలకుగాను లేఅవుట్‌లో మొత్తం ఏరియాలో 60 శాతం ఏరియాను ఒపెన్‌ (ఖాళీగా) ఉంచాలి. రోడ్లు నిర్ధారించాలి.. ఉపయోగించే స్థలంలో 90 శాతం ఏరియా వినోదం, పరిరక్షణకు ఉపయోగపడేలా మాస్టర్‌ప్లాన్‌ రూపొందించారు. ఈ 90 శాతం ఏరియాలో వ్యవసాయ, ఉద్యానవన పంటలు, పూల తోటలను వినియోగించేలా విభజించడం జరిగింది. ఈ 90 శాతం వ్యవసాయ, ఉద్యానవన, పూల తోటల పెంపకాల ద్వారా జలాశయాలను పరిరక్షించుకోవచ్చని నిబంధలను చెబుతున్నాయి. ఈ పంటల పెంపకంలోనూ మందులు, రసాయన ఎరువుల వాడకాన్ని సాధ్యమైనంతవరకు తగ్గించుకునేలా హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లు అండ్‌ సీవరేజ్‌ బోర్డు పర్యవేక్షించాలని నిబంధనలు చెబుతున్నాయి. జలాశయాల నుండి 10 కి. మీ. దూరం వరకు కాలుష్య కారక పరిశ్రమలను నిషేధించారు. వాతావరణ కాసుష్యాన్ని నియంత్రించేందుకు సూచనలు చేశారు. ఈ జోన్‌లో స్థానిక పరిశ్రమలను పూర్తిగా నిషేధించారు. అయితే ప్రస్తుతం ఈ నిబందనలు ఏవి ఆచరణకు నోచుకోవడం లేదు. క్యాచ్‌మెంట్‌ ఏరియాల్లో సరికొత్త వెంచర్లు వెలుస్తున్నాయి. నిబంధనలు అతిక్రమిస్తూ యధేచ్ఛగా నిర్మానాలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే అక్రమ నిర్మాణాలు అనేకం వెలిశాయని, రానున్న రోజుల్లో ఈ జంట జలాశయాల్లో ఎగువ ప్రాంతాల నుండి నీరు వచ్చే మార్గాలన్నీ మూసుకుపోతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్లాంటిగ్‌ చేసి విక్రయిస్తున్నారని దీని వల్ల తాగునీరందించే చారిత్రాత్మక జంటజలాశయాలు రానున్న రోజుల్లో కలుషితమై మరో హుస్సేన్‌ సాగర్‌ గా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ లేఅవుట్లతో నిర్మాణాలు కొనసాగుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార యంత్రాంగం ఇలాగే వ్మవహరిస్తే ఈ జలాశయాలు అతి కొద్ది రోజుల్లోనే కలుషితమై తాగునీటికి వినియోగంలోకి రాకుండా పోతాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అధికార యంత్రాంగం తక్షణం స్పందించి అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలని, నిబంధనల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?