యథాతథస్థితి కొనసాగాల్సిందే : సిపిఐ

ప్రజాపక్షం/న్యూఢిల్లీ  : భారత్‌, చైనా సరిహద్దుల్లో యథాతథ పూర్వస్థితి కొనసాగాల్సిందేనని సిపిఐ అభిప్రాయపడింది. గల్వన్‌ లోయ వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘర్షణకు దారితీసిన ఉద్రిక్త పరిస్థితులకు పూర్వం సరిహద్దులో పరిస్థితి ఎలా వుందో అదే పరిస్థితినికొనసాగించడానికి ఇరుదేశాలు కృషి చేయాలని కోరింది. ఈ మేరకు సిపిఐ జాతీయ కార్యదర్శివర్గం బుధవారం నాడొక ప్రకటన విడుదల చేసింది. గల్వన్‌ ఘర్షణలో మృతిచెందిన భారత సైనికులకు సిపిఐ ఘనంగా నివాళి అర్పించింది. వారి కుటుంబసభ్యులకు సం తాపం తెలిపింది. వారి త్యాగాలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకొంటుందని, శాంతియుత మార్గాల ద్వారా ప్రతిష్టంభనను తొలగించడమే అమరవీరులకు ఇచ్చే ఉత్తమమైన నివాళి అవుతుందని పేర్కొంది. వాస్తవాధీనరేఖ వెంబడి గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు బాధాకరమని, చర్చల సమయంలో ఇలా ఘర్షణ జరగడం అవాంఛనీయమని వ్యాఖ్యానించింది. రెండు దేశాల మధ్య ప్రతిష్టంభనకు పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం అనివార్యమని భావించింది. సరైన స్థాయుల్లో చర్చలు జరపడం ద్వారా ప్రస్తుత ఘర్షణ వాతావరణాన్ని అధిగమించడానికి కృషి జరగాలని కోరింది. ఎట్టిపరిస్థితుల్లోనూ యథాతథపూర్వ స్థితిని కొనసాగించాలని సిపిఐ సూచించింది. దీర్ఘకాలంగా వాస్తవాధీన రేఖ వెంబడి ఇరుదేశాలు గౌరవపూర్వకంగా వ్యవహరించుకుంటున్న తీరును ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఇకపై కూడా ఆనాటి వాతావరణమే కొనసాగాలని, ఉద్రిక్తతల పూర్వ పరిస్థితిని పునరుద్ధరించాలని కోరింది. వీలైనంత త్వరగా ఇరుదేశాల నేతలు శాంతియుత పరిష్కారానికి చొరవచూపుతారని ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే, తాజా పరిణామాలపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, పరిస్థితిని సమీక్షించాలని, తద్వారా భారత ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వ రక్షణకు దేశం యావత్తూ ఐక్యంగా వున్న విషయాన్ని స్పష్టం చేయాలని సిపిఐ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయంలో ప్రభుత్వం రాజకీయ పార్టీలను, ప్రజలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.

DO YOU LIKE THIS ARTICLE?