మోడీ..ఇండియా విభజనకారి!

టైమ్‌ మ్యాగజైన్‌ కవర్‌స్టోరీ కలకలం
కొన్ని కుట్రలకు మోడీ నేతృత్వం వహిస్తున్నట్లుగా కథనం

న్యూయార్క్‌ : ఎన్నికల వేళ భారత ప్రధానమం త్రి నరేంద్రమోడీకి షాక్‌ తగిలింది. భారత సార్వత్రిక ఎన్నికలపై టైమ్‌ మ్యాగజైన్‌ ప్రచురించిన ముఖచిత్ర కథనం కలకలం రేపింది. మోడీని భారత ప్రధాన విభజనకారిగా, విభజనవాదిగా పతాకశీర్షికను ప్రచురించింది. ఓవైపు మోడీని సంస్కరణలు తీసుకువచ్చిన వ్యక్తిగా పేర్కొంటూనే మరోవైపు కొన్ని పరిణామాలకు కుట్రదారునిగా ప్రజలు భావిస్తున్న విషయాన్ని నొక్కివక్కాణించి సంచలనం సృష్టించింది. “బువ్వపెట్టి మూతి పగలగొట్టిన” చందంగా మోడీకి టైమ్‌ మ్యాగజైన్‌ నుంచి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న విషయం తెల్సిం దే. అందుకే అమెరికాకు చెందిన ప్రముఖ వీక్లీ టైమ్‌ మ్యాగజైన్‌ కూడా ఈసారి భారత ఎన్నికలపై ప్రత్యేక అంతర్జాతీయ ఎడిషన్‌ తీసుకొచ్చింది. దీంతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫొటోను కవర్‌ పేజీపై ప్రచురించింది. ఎన్నికలు సరిగ్గా తుది అంకానికి చేరుకుంటున్న తరుణంలో ‘టైమ్‌’ సంచలన కథనం ప్రచురించడం ప్రాధాన్యత సంతరించుకుంది. “భారతదేశ ప్రధాన విభజనకారి” అన్న శీర్షికతో మోడీ క్యారికేచర్‌ను ముఖచిత్రంగా ముద్రించింది. “ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మరో ఐదేళ్లు మోడీ ప్రభుత్వాన్ని భరించగలదా?” అని రచయిత ఆతిష్‌ తషీర్‌ ప్రశ్నించారు. “జనాకర్షక దిశగా పతనమైన గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థ ఏదైనా ఉంటే అది భారతదేశమే…” అంటూ ఈ కథనం ప్రారంభమవుతుంది. టర్కీ, బ్రెజిల్‌, బ్రిటన్‌, అమెరికా తదితర ప్రజాస్వామ్య దేశాల్లో మాదిరిగా భారత్‌లో ఈ జనాకర్షక రాజకీయం ముసురుకుంటున్నదని రచయిత పేర్కొన్నారు. 2019 మే 20వ తేదీతో వెలువడే టైమ్‌ మ్యాగజైన్‌ ఐరోపా, మధ్య ప్రాచ్యదేశాలు, ఆఫ్రికా, ఆసియా, దక్షిణ పసిఫిక్‌ అంతర్జాతీయ ఎడిషన్‌గా పంపిణీ అవుతుంది. కవర్‌ పేజీపై మోడీ ఫొటో పక్కన ‘ఇండియాస్‌ డివైడర్‌ ఇన్‌ చీఫ్‌’ అంటూ వివాదాస్పద హెడ్‌లైన్‌ రాసింది. దీంతో పాటు ‘మోడీ ది రిఫార్మర్‌’ అనే మరో హెడ్‌లైన్‌ కూడా ఇచ్చింది. ‘ఇండియాస్‌ డివైడర్‌ ఇన్‌ చీఫ్‌’ కథనాన్ని ప్రముఖ భారత జర్నలిస్టు తవ్లీన్‌ సింగ్‌ కుమారుడు ఆతిష్‌ తసీర్‌ రచించారు. మరో కథనం ‘మోడీ ది రిఫార్మర్‌’ను ప్రముఖ కన్సల్టింగ్‌ సంస్థ యురేసియా గ్రూప్‌ వ్యవస్థాపకుడు ఇయాన్‌ బ్రెమర్‌ రాశారు. మ్యాగజైన్‌ లోపల ‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మరో ఐదేళ్లు మోడీ ప్రభుత్వం వస్తుందా?’ అనే పేరుతో తసీర్‌ కథనం మొదలవుతుంది. మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ లౌకికవాదాన్ని, “మోడీ హయాంలో ప్రబలుతున్న సామాజిక “ఉద్రిక్తత”తో పోల్చుతూ ఈ కథనం సాగింది. దీంతో పాటు వందలాది మందిని బలిగొన్న గుజరాత్‌ అల్లర్లను కూడా ఈ వ్యాసంలో గుర్తుచేశారు. బిజెపి హిందూత్వ రాజకీయాలే భారత ఓటర్లు నిలువునా చీలడానికి కారణమని రచయిత ప్రముఖంగా పేర్కొన్నారు. “2014 ఎన్నికల తర్వాత స్వతంత్ర భారత రాష్ట్రాల ప్రాధమిక సిద్ధాంతాలు, దాని సమరయోధులు, మైనారిటీ స్థానం సహా దేశంలో అనేక వ్యవస్థల మధ్య తీవ్ర అపనమ్మకాలు ఏర్పాడ్డాయి” అంటూ రచయిత విమర్శలు గుప్పించారు. 2014 ఎన్నికల తర్వాత స్వతంత్ర భారత ప్రధాన లక్ష్యాలైన లౌకికవాదం, ఉదారవాదం, భావ ప్రకటనా స్వేచ్ఛ వంటివి ప్రమాదంలో పడ్డాయని, వాటిని చాలామంది అతిపెద్ద కుట్రలో భాగంగా చూస్తున్నారని, ఇంకో వర్గం ఈ లక్ష్యాలను నాశనం చేయడానికి కుట్ర జరుగుతోందని భావిస్తున్నారని ఆ వ్యాసం పేర్కొంది. అంటే మోడీ పాలన దేశ ప్రజల మధ్య విభజనరేఖను గీసిందని, పచ్చిగా చెప్పాలంటే జనంలో చీలిక వచ్చిందని పేర్కొంది. 2002 గుజరాత్‌ అల్లర్లపై మౌనం దాల్చిన కారణంగా మోడీ అల్లరి మూకలకు అత్యంత ఆప్తుడిగా మారారంటూ రచయిత విమర్శలు గుప్పించారు. గోహత్యలపై కూడా మోడీ మౌనం దాల్చడం ప్రశ్నార్థకమైందన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?