మోడీ ‘ఆదర్శ’పథకం… అట్టర్‌ఫ్లాప్‌!

ఎంపీల దత్తగ్రామ పథకాన్ని ఎంపీలే తొక్కేశారు
ఆరంభశూరత్వంగానే మిగిలిపోయిన ఎస్‌ఎజివై
న్యూఢిల్లీ : గ్రామ వికాసం గాల్లో కలిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మానస పుత్రిక మాయమైంది. ఎంపీలపై నమ్మకంతో తెచ్చిన పథకాన్ని ఎంపీలే పాతాళంలోకి తొక్కేశారు అట్టహాసంగా ప్రకటించిన మోడీ ఆదర్శ పథకం అట్టర్‌ఫ్లాప్‌ అయింది. ఈ మాట చెప్పింది ఎవరో కాదు… స్వయంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖనే. మోడీకి విశేష ప్రాచుర్యం కల్పించిన వినూత్న పథకం ‘సన్సద్‌ ఆదర్శ గ్రామ యోజన’ (ఎస్‌ఎజివై) పథకం ఘోర వైఫల్యం చెందిన విషయాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ వెలుగులోకి తీసుకువచ్చింది. బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం, దాని ఎంపీల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా ఈ పథకం నిలిచింది. గ్రామ వికాసమే లక్ష్యంగా మొదలు పెట్టిన ఎస్‌ఎజివై పథకం గడిచిన ఆరేళ్లూ ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయింది. ఒక్కో ఎంపీ ఒక్కో గామాన్నీ దత్తత తీసుకొని, ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ఈ పథకం ఉద్దే శం. కానీ సచిన్‌ టెండూల్కర్‌ వంటి కొద్ది మంది తప్ప ఈ పథకాన్ని పట్టించుకున్న ఎంపీలంటూ ఎవ్వరూ లేకపోవడం విచారకరం. కొందరు ఎంపీలను తమ దత్తత గ్రామాలను గుర్తించినా, వాటిపై కన్నెత్తయినా చూడకపోగా, ఇంకొందరు అసలు తమ దత్త గ్రామాలనే గుర్తించకపోవడం శోచనీయం. ప్రతి ఎంపీ తన దత్త గ్రామ అభివృద్ధి కోసం ఎంపీల్యాడ్స్‌ (మెంబర్స్‌ ఆఫ్‌ పార్లమెంట్‌ లోకల్‌ ఏరియా డవలప్‌మెంట్‌ స్కీమ్‌) కింద తగినన్ని నిధులను కేటాయించుకోవచ్చు. కానీ వాస్తవంగా అది జరగలేదు. ఈ పథకాన్ని పట్టించుకున్న ఎంపీలను చేతివేళ్లపై లెక్కపెట్టవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ పథకానికి ఎంపికైన గ్రామాల్లో ఇప్పటి వరకు ఏమాత్రం మార్పు రాలేదని గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన కేంద్ర పనితీరు నివేదిక గుర్తించింది. పల్లెల్లో సర్వతోముఖ వికాసం కోసం రూపొందించిన ఎస్‌ఎజివై ప్రారంభమై ఆరేళ్లు పూర్తయినా లక్ష్యాన్ని చేరుకోలేదనీ.. గ్రామీణ అభివృద్ధి శాఖ దీన్ని పునఃసమీక్షించి మరింత మెరుగ్గా అమలు చేయాలని పేర్కొంది. గ్రామాల్లో అమలవుతున్న పథకాలపై గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెప్పించుకున్న కామన్‌ రివ్యూ మిషన్‌-2019 (సిఆర్‌ఎం) ఈ మేరకు పలు సూచనలు చేసింది. “రాష్ట్రాల్లో పర్యటించిన సిఆర్‌ఎం బృందాలకు ఎస్‌ఎజివై వల్ల గ్రామాల్లో చెప్పుకోదగిన మార్పులేవి కనిపించలేదు. ఎంపిక చేసిన ఎస్‌ఎజివై పంచాయతీలకు ఎంపీలు తమ ఎంపీల్యాడ్స్‌ నిధుల నుంచి పెద్దగా నిధులు మంజూరు చేయలేదు. ఎంపీలు క్రియాశీలకంగా పనిచేసిన కొన్ని గ్రామాల్లో మాత్రం కొంత మేర మౌలిక సదుపాయాలు మెరుగైనప్పటికీ.. ప్రత్యేకంగా ఈ పథకం వల్ల గుర్తించదగిన మార్పులేవీ లేవు…” అని సిఆర్‌ఎం నివేదిక పేర్కొంది. గ్రామాల సర్వతోముఖ అభివృద్ధే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ 2014 అక్టోబర్‌ 11న సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన(ఎస్‌ఎజివై) ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రతి పార్లమెంటు సభ్యుడు ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని 2016 నాటికల్లా దాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి. 2019 నాటికి మరో రెండు గ్రామాలను అభివృద్ధి చేయాలి. ఆ తర్వాత 2024 నాటికి ఒక్కో ఎంపీ మరో ఐదు గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేయాలన్నది ఈ పథకం లక్ష్యం. అలా ప్రతి యేటా కొందరు ఎంపీలు తమ నియోజకవర్గాల్లో గ్రామాలను దత్తత తీసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ పథకం అంతగా ముందుకెళ్లకపోవడానికి ప్రధానం రెండు అడ్డంకులు ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటే నియోజకవర్గంలోని మిగతా గ్రామాలు సదరు ఎంపీ మీద ఆగ్రహం వ్యక్తం చేయడం ఒకటైతే.. ఈ పథకం కోసం ప్రత్యేకంగా నిధులేవీ కేటాయించకపోవడం మరో ప్రతికూలాంశంగా భావిస్తున్నారు. అయితే ఈ పథకం ప్రధాని మానస పుత్రిక కాబట్టి దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పట్టుదలగా ఉన్నట్టు కనిపిస్తోంది. మరోవైపు ఎస్‌ఎజివై పథకం అసలు లక్ష్యం నెరవేరనందున ఈ పథకాన్ని ఇంకా ప్రారంభం కానిదిగానే (నాన్‌స్టార్టర్‌) పరిగణించాలని సీఆర్‌ఎం పేర్కొంది. దీనిపై పూర్తి స్థాయిలో సమీక్షించి మరింత ప్రభావవంతంగా అమల్లోకి తేవాలని సూచించింది. గ్రామాల అభివృద్ధి పట్ల కబుర్లు చెప్పే పార్లమెంటు సభ్యుల వాస్తవ రూపం ఈ పథకం అమలుతో బట్టబయలైంది.

DO YOU LIKE THIS ARTICLE?