మేం మూడు రిటర్న్‌ గిఫ్ట్‌లు ఇస్తాం

అమరావతి : తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఒక్క రిటర్న్‌గిఫ్ట్‌ ఇస్తే తిరిగి మూడు గిఫ్ట్‌లు ఇస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. అంతే తప్ప వదిలేసే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. రాష్ట్ర అభ్యున్నతే లక్ష్యంగా నిజాయితీగా పనిచేసుకుంటూ పోతున్నామని, ఎవరికీ భయపడేది లేదని చెప్పారు. శుక్రవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో తారకరామసాగర్‌, వావిలాల ఘాట్‌ ప్రారంభించారు. ఎన్టీఆర్‌ సాగర్‌లో సభాపతి కోడెల శివప్రసాద్‌రావుతో కలిసి బోటులో విహరించారు. సత్తెనపల్లిలో 36 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ సిబిఐని జగన్‌ మెడ మీద పెట్టి ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. కోడి కత్తి కేసును ఎన్‌ఐఎకి ఇవ్వడం ద్వారా తమకు లేని అధికారాన్ని కేంద్రం తీసుకుందని ఆయన విమర్శించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడిన పార్టీ టిడిపి అని, రాష్ట్ర హక్కులను ఎవరు అపహరించినా రాజీలేని పోరాటం చేస్తామని ఉద్ఘాటించారు. “అది మాకు ఎన్టీఆర్‌ ఇచ్చిన స్ఫూర్తి. అలాంటిది కెసిఆర్‌ మాకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తారట. మేమేమైనా చేతగానివాళ్లమా? మేం మూడు గిఫ్ట్‌లు తిరిగి ఇస్తామే తప్ప వదిలి ప్రసక్తే లేదు. కెసిఆర్‌, జగన్‌ కలిసినా ఏమీ చేయలేరు. ఇప్పు వారు కొత్తగా కులాల పేరిట ప్రజల్లో చిచ్చుపెట్టాలని చూస్తున్నారు. అలాంటి నాయకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. టిడిపి ఎదుర్కోవడానికి ఏ ఆసరా లేక కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. బిజెపి దేశ ప్రజలను అన్ని విధాలా ఇబ్బందులకు గురిచేసినందుకు గుణపాఠం తప్పదన్నారు. కోల్‌కతాలో శనివారం మమత బెనర్జీతో సమావేశమవుతున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. దేశంలోని ప్రతిపక్షాలు హాజరవుతున్న ఈ భేటీలో చర్చించి అందరి సహకారంతో దేశాన్ని బిజెపి నుంచి కాపాడుకుంటామని తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?