మూడోరోజూ జూడాల సమ్మె

ప్రభుత్వం హామీ నిలబెట్టుకోకపోవడంతో సమ్మె కొనసాగిస్తున్నాం: జూనియర్‌ డాక్టర్లు
ప్రజాపక్షం/హైదరాబాద్‌:  గాంధీ ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్ల సమ్మె మూడో కూడా కొనసాగుతోందని జూనియర్‌ డాక్టర్‌ సంఘం ప్రకటించింది. బుధవారం నాడు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వారితో చర్చలు జరిపి సఫలమయ్యాయని ప్రకటించారు. అయితే, ప్రభుత్వం హామీ నిలబెట్టుకోకపోవడంతో సమ్మెను కొనసాగిస్తునట్లు జూనియర్‌ డాకర్లు గురువారం ప్రకటించారు. 4 కోట్ల మంది జనాభాకు ఒక గాంధీ ఆస్పత్రినా…? ఒక్క ఆస్పత్రే అన్ని కేసులకు ఎలా చికిత్స అందిస్తుందని ఒక జూనియర్‌ వైద్యురాలు భావోద్వేగంతో చేసిన ప్రసంగం సోషల్‌ మీడియాలో వైరలై రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. లక్షల మందికి కరోనా సోకినా చికిత్సకు సిద్ధంగా ఉన్నామని ఒకవైపు ప్రభుత్వం ప్రకటిస్తుంటే, మరోవైపు ఒక జూనియర్‌ వైద్యురాలు కురిపించిన ప్రశ్నలు ప్రభుత్వ డొల్లతనాన్ని బహిర్గతం చేస్తోందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. లక్షల మందికి కేసులు రావడం పక్కన పెడితే కనీసం గాంధీ ఆస్పత్రిలోనే కనీస మౌలిక వసతులు, వైద్యుల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్‌ చికిత్స విషయంలో ప్రభుత్వ నిర్లక్షంగా వ్యవహరిస్తోందనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్‌ వైద్యులు ఇలాగే సమ్మెను కొనసాగిస్తే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పట్ల తప్పుడు అభిప్రాయాలు, ప్రభుత్వంపై ఉన్న నమ్మకం సన్నగిల్లుతోందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే జూడాలతో సమ్మెను విరమింపజేసేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. అయితే ఆస్పత్రిలోని లోపాల కారణంగా పేషంట్లకు ఏమైనా జరిగితే ఆ ఆగ్రహాన్ని తమపై చూపడం సరైంది కాదని, రోగులతో నిత్యం ఉండే తమపైనే పేషంట్ల కుటంబ సభ్యులు తమ ప్రతాపాన్ని చూపుతున్నారని జూడాలో ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా వైద్యులకు రక్షణ కల్పించాలని, అన్నీ కేసులను ఇక్కడికే తరలించకుండా ఇతర ఆస్పత్రిలో కూడా కరోనా చికిత్స చేపట్టాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రతి రోజూ 80 నుండి 90 వరకు కరోనా వైరస్‌ లక్షణాలతో గాంధీ ఆస్పత్రికి వస్తున్నారని, ఇందులో 30మందికి పాసిటీవ్‌గా నిర్ధారణ అవుతుందని జూనియర్‌ వైద్యులు చెబుతున్నారు. కాగా ఇతర పెద్ద ఆస్పత్రుల నుండి సీరియస్‌ అంటూ గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నారని, ఇలాంటి వారి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నదని, ఇలాంటి పరిస్థితుల్లో చికిత్స ఎలా అందిస్తారని వారు వాపోతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?