ముచ్చటగా 3 సిట్‌లు

కేసులు ఇక్కడ.. దర్యాప్తు ఎపిలో
కేసులు ఎపిలో.. దర్యాప్తు ఇక్కడ
దర్యాప్తులో ఒకరికొకరు సహకరించే అవకాశాలు నిల్‌
నేతల ఇళ్లపై వరుస దాడులకు పథకాలు
వ్యక్తిగత కంప్యూటర్లు సీజ్‌ చేసే అవకాశాలు

ప్రజాపక్షం/ హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల వ్యక్తిగత డేటా కుంభకోణం, లక్షలాది ఓట్ల తారుమారు ఉదంతంలో తెలుగు రాష్ట్రాల్లో ముచ్చటగా మూడు స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం (సిట్‌)లు ఏర్పాటయ్యాయి. ఎపి, తెలంగాణ ప్రభుత్వాలు పోటాపోటీగా సిట్‌లను ఏర్పాటు చేశారు. ఐటి గ్రిడ్‌ కుంభకోణం కేసులో తెలంగాణ ప్రభుత్వం ఐజి స్టీఫెన్‌ రవీంద్ర నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేయగా, ఫామ్‌7 కుంభకోణం, టిడిపి డేటా చోరీ ఉదంతంపై ఎపి ప్రభుత్వం ఫైర్‌ విభాగం డిజి సత్యనారాయణ నేతృత్వంలో రెండు సిట్‌లను ఏర్పాటు చేసింది. ఈ మూడు సిట్‌ లు కూడా రాత్రికి రాత్రే ఆగమేఘాలపై దర్యాప్తును ముమ్మ రం చేశాయి. అయితే గమ్మతైన విష యం ఏమిటంటే ఎపిలో నమోదైన కేసులకు  సంబంధించి తెలంగాణలో దర్యాప్తు చేయాల్సిన దుస్థితి, తెలంగాణలో నమోదైన కేసుల దర్యాప్తుకు సంబంధించి ఎపిలో దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఒక రాష్ట్ర పోలీసులు మరో రాష్ట్ర పోలీసుల దర్యాప్తుకు సహకరాలు అందిస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. వారం రోజులుగా తెలుగు రాష్ట్రాలో పోలీసుల మధ్య, ప్రభుత్వాల మధ్య పెద్ద వైరమే తలెత్తింది. ఈ నేపథ్యంలో ఒక రాష్ట్ర పోలీసులు దర్యాప్తు నిమిత్తం పొరుగు రాష్ట్రానికి వెళితే అక్కడి పోలీసులు సహకరించరనే అనుమానాలు కలుగుతున్నాయి. అలాంటి సమయంలో దర్యాప్తు నీరుగారే ప్రమాదం ఉందని ఓ పోలీసు ఉన్నతాధికారి అనుమనాలు వ్యక్తం చేశారు. మాదాపూర్‌లో ఐటి గ్రిడ్స్‌ సంస్థపై, కెపిహెచ్‌బికాలనీ పోలీసుస్టేషన్‌లో ఎపి పోలీసులపై, అలాగే ఎస్‌ఆర్‌నగర్‌లో ఎపిలో అక్రమంగా ఓట్లు తొలగించారనే ఫిర్యాదుపై ఇప్పటికే కేసులు నమోదు కాగా, తాజాగా టిఆర్‌ఎస్‌ నేతలు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసు స్టేషన్‌లో తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని ఎపి సిఎం చంద్రబాబు పై ఫిర్యాదు చేశారు. తెలంగాణలో ఉన్న ఈ నాలుగు కేసులు కూడా దర్యాప్తు చేయాలంటే ఇక్కడి పోలీసు అధికారులు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిందే. అదే పద్ధతిలో గుంటూరులో ఐటి గ్రిడ్స్‌ ఉద్యోగులపై నమోదైన మిస్సింగ్‌ కేసు, ఫామ్‌ 7 కుంభకోణం, టిడిపి డేటా చోరీ దర్యాప్తు కోసం రెండు సిట్‌లను ఎపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కేసుల దర్యాప్తు చేయాలంటే ఎపి పోలీసులు తెలంగాణకు రావాల్సి ఉంటుంది. ఇక్కడి పోలీసులు అక్కడికి వెళ్లిన సమయంలో అక్కడి పోలీసులు ఇక్కడి పోలీసులకు సహకరిస్తారా, అదే విధంగా అక్కడి పోలీసులు దర్యాప్తు కోసం ఇక్కడికి వస్తే ఇక్కడి పోలీసులు అక్కడి పోలీసులకు సహకరిస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రభుత్వాల మధ్య, పోలీసుల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తులపై అనుమానాలు కలుగుతున్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?