ముగిసిన తొలిదశ నామినేషన్ల ప్రక్రియ

జడ్‌పిటిసి స్థానాలకు 2,104, ఎంపిటిసి స్థానాలకు 15,036 నామినేషన్లు
ప్రతిపక్షాల జోరు
అధికార పార్టీ బేజారు

ప్రజాపక్షం/హైదరాబాద్‌: రాష్ట్రంలో తొలి విడతలో జరగనున్న ఎంపిటిసి స్థానాల ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. దాఖలైన నామినేషన్లను పరిశీలిస్తే ఈ సారి పరిషత్‌ ఎన్నికల్లో ప్రతిపక్షాల జోరు కనిపిస్తుండగా, లెక్కకు మించిన అభ్యర్థులు పోటీ పడుతుండడంతో అధికార పార్టీ బేజారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నా యి. తొలివిడతలో 197 జడ్‌పిటిసి స్థానాలకు 2166 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానాల్లో పోటీ చేసేందుకు అధికారపార్టీతో పాటు ప్రతిపక్షాలకు చెందిన నేతలు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. చాలా చోట్ల స్వతంత్రులు కూడా బరిలో నిలిచారు. తొలి విడతలో జరిగే 2166 ఎంపిటిసి స్థానాలకు మొత్తం 15036 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే తొలివిడతలో ఎన్నికలు జరగనున్న 197 జడ్‌పిటిసి స్థానాలకు మొత్తం 2104 మంది నామినేషన్లు దాఖలు చేశారు. స్థానికం కావడంతో పార్టీ ఇమేజితో పాటు వ్యక్తిగత ఇమేజి, పరిచయాలు, బంధుగణం, స్నేహితుల బలం ఉండే వారు బరిలో పోటీ పడుతున్నారు. దీంతో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వలే ప్రతిపక్షాలు ఈ అభ్యర్థుల నిలబెట్టడం కోసం ఏమాత్రం కష్టపడాల్సి రాలేదు. పైగా పోటీ ఉండడంతో ఎవరిని బుజ్జగించాలి, ఎవరిని బరిలో ఉంచాలి అన్న సమస్య ఎదురవుతుండడం విశేషం. పోటీ చేసేందుకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ నెలకొంది. అధికార పార్టీ టిఆర్‌ఎస్‌లోనూ ఈ సమస్య తీవ్రంగానే ఉంది. దాఖలైన నామినేషన్లను పార్టీల వారీగా పరిశీలిస్తే… ఎంపిటిసి స్థానాలకు బిజెపికి చెందిన 1576 నామినేషన్లు, సిపిఐ 182, సిపిఎం 284, కాంగ్రెస్‌ 4178, టిఆర్‌ఎస్‌ 5762,టిడిపి 227, వైఎస్‌ఆర్‌సిపి నుంచి ఒకటి, ఇతరులు 113 నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే జడ్‌పిటిసి స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన వాటిలో బిజెపి 276, సిపిఐ 34, కాంగ్రెస్‌ 551, టిఆర్‌ఎస్‌ 5762, టిడిపికి 80, వైఎస్‌ఆర్‌సిపి నుంచి మూడు, ఇతరులు 48 నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా ఎంపిటిసి నల్గొండలో 109 ఎంపిటిసి స్థానాలకు 1104, అత్యల్పంగా ములుగు జిల్లాలో 16 ఎంపిటిసి స్థానాలకు 16 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే జడ్‌పిటిసి స్థానాల నామినేషన్లను పరిశీలిస్తే అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 7 స్థానాలకు 184, అత్యల్పంగా సిద్దిపేట జిల్లాలో 10 స్థానాలకు 14 నామినేషన్లు దాఖలయ్యాయి. డీలా పడిందన్న కాంగ్రెస్‌లో పరిషత్‌ జోరు స్పష్టంగా కనిపించింది. అధికార పార్టీ నేతలు తమ జోరును చూసి కాంగ్రెస్‌ నుంచి పోటీకి ఎక్కువగా ఆసక్తి చూపరని, తమ పార్టీ వారి గెలుపు ఖాయమని భావించిన తరుణంలో కాంగ్రెస్‌లో టికెట్ల కోసం పోటీ పడడంతో వారు ఒకింత కంగు తినాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కారణం కాంగ్రెస్‌ పార్టీ విషయానికి వస్తే మొత్తం 2166 ఎంపిటిసి స్థానాలకు ఏకంగా రెట్టింపు 4178 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అదే టిఆర్‌ఎస్‌ నుంచి 5761 నామినేషన్లు దాఖలు చేశారు. అంటే దాదాపు మూడు రెట్లు. టిఆర్‌ఎస్‌ టికెట్‌ వస్తే గెలిచినట్టే అని భావిస్తున్న ఆ పార్టీ నేతలు పోటి నుంచి తప్పుకోవడానికి కూడా ససేమిరా అనే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో టిఆర్‌ఎస్‌లో రెబెల్స్‌ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో కాంగ్రెస్‌లోనూ పరిషత్‌ ఎన్నికల ఉత్సాహం ఒకింత జోరుగా కనిపిస్తోంది.

DO YOU LIKE THIS ARTICLE?