మీరైనా స్పందించండి

జర్నలిస్టుల కష్టాలపై గవర్నర్‌కు టియుడబ్ల్యుజె వినతి
ప్రజాపక్షం/హైదరాబాద్‌ : రాష్ర్టంలో జర్నలిస్టులు అనుభవిస్తున్న కష్టాలపై కనీసం మీరైనా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని గవర్నర్‌ డాక్టర్‌ తమిళి సై సౌందర రాజన్‌ ను తెలంగాణ రాష్ర్ట వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం (టియుడబ్ల్యుజె) ప్రతినిధి బందం విజ్ఞప్తి చేసింది. ఐజెయు అధ్యక్షులు కె.శ్రీనివాస్‌రెడ్డి, టియుడబ్ల్యుజె రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కె.విరాహత్‌ అలీల నేతృత్వంలో ప్రతినిధి బృందం గురువారం రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ను కలిసి జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. గత నాలుగేళ్లుగా జర్నలిస్టుల సంక్షేమం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని వారు తెలిపారు. ముఖ్యం గా కరోనా ప్రమాదం నుండి జర్నలిస్టులను రక్షించాలని గవర్నర్‌ను కోరారు. ఇప్పటికే రాష్ర్టంలో 22 మంది జర్నలిస్టులు కరోనా వైరస్‌ బారిన పడ్డారని, ఇందులో మనోజ్‌కుమార్‌ అనే యువ పాత్రికేయుడు ఇటీవలే ప్రాణం కోల్పోయినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాతో గాంధీ ఆసుపత్రిలో చేరుతున్న జర్నలిస్టులకు సరైన చికిత్స అందడం లేదన్నారు. కరోనా మహమ్మారిని నివారించడానికి వైద్యులు, పారామెడికల్‌, పారిశుధ్య కార్మికులు, పోలీసుల మాదిరిగానే జర్నలిస్టులు సైతం ప్రాణాలను పణంగా పెట్టి విశిష్టమైన సేవలను అందిస్తున్నారన్నారు. ఇందుకు జర్నలిస్టులకు కూడా రూ.50లక్షల ఆరోగ్య బీమా సౌక ర్యం కల్పించాలని కోరారు. కరోనాతో మృరణించిన మనోజ్‌ కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారం చెల్లించాలన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన జర్నలిస్టులకు, మీడియా సిబ్బందికి చికిత్స కోసం ప్రత్యేక ఆసుపత్రి కేటాయించాలన్నారు. వ్యాధి నుంచి కొలుకునేంత వరకు బాధిత జర్నలిస్టులకు, మీడియా సిబ్బందికి ప్రత్యేక ఆర్థిక సహకారాన్ని అందించాలని టియుడబ్ల్యుజె ప్రతినిధి బృందం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు అందించిన వినతి పత్రంలో పేర్కొన్నారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఐజెయు కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డి, టియుడబ్ల్యుజె ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్‌ శ్రీకాంత్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా విభాగం నాయకులు రాములు ఉన్నారు.
మనోజ్‌ మృతి బాధాకరం : గవర్నర్‌
టివి- 5 జర్నలిస్టు మనోజ్‌ కుమార్‌ కరోనాతో మరణించడం బాధాకరమని రాష్ర్ట గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. కరోనా వ్యాధి కట్టడిలో జర్నలిస్టుల సేవలను ఆమె ప్రశంసించారు. జర్నలిస్టులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తనను కలుసుకున్న ఐజెయు, టియుడబ్ల్యుజె ప్రతినిధి బృందంతో గవర్నర్‌ మాట్లాడుతూ, ప్రస్తుత గడ్డు పరిస్థితి నుంచి సమాజాన్ని కాపాడేందుకు వార్తల ద్వారా ప్రజలను మరింత చైతన్యపర్చాలని కోరారు. కరోనా వైరస్‌ సోకిన జర్నలిస్టులకు చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలని, ఈ విషయమై రాష్ర్ట ప్రభుత్వానికి తగు సూచనలు చేస్తానని హామీ ఇచ్చారు.

DO YOU LIKE THIS ARTICLE?