మిథాలీ వరల్డ్‌ రికార్డు

లక్నో: మహిళల క్రికెట్‌లో పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్న హైదరాబాదీ మిథా లీ రాజ్‌ మరో ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఇటీవలే టెస్టు క్రికెట్‌లో 10,000 పరుగులు చేసి, ప్రపంచంలో ఈ ఫీట్‌ను అందుకున్న రెండో క్రికెటర్‌గా, తొలి భారతీయురాలిగా గుర్తింపు సంపాదించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె మహిళల వన్డే ఇంటర్నేషనల్స్‌ ఫార్మాట్‌లో 7,000 పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన నాలుగో వన్డేలో ఆడిన 38 ఏళ్ల మిథాలీ 71 బంతుల్లో 45 పరుగులు సాధించింది. కెరీర్‌లో 213వ వన్డే ఆడిన ఆమె, 7,000 పరుగుల మైలురాయిని అధిగమించింది. ఇంతకు ముందు మహిళల క్రికెట్‌లో 6,000 పరుగులను పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌విమన్‌గా కూడా రికార్డు స్థాపించింది. టెస్టు క్రెకెట్‌లో మిథాలీ కంటే ముందు పది వేల పరుగులు చేసిన చార్లొట్‌ ఎడ్వర్డ్‌ వన్డే ఇంటర్నేషనల్స్‌లో మాత్రం చాలా వెనుకబడి ఉంది. ఆమె ఖాతాలో కేవలం 5,992 పరుగులు మాత్రమే ఉన్నాయి. ఆమె కంటే ఈ ఫార్మాట్‌లో మిథాలీ 1,000 పరుగులకుపైగా ముందంజలో ఉండడం విశేషం. ఇలావుంటే, దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో వన్డేలో ఏడు వికెట్ల తేడాతో ఓడిన భారత్‌ సిరీస్‌ను కూడ చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ పూనమ్‌ రావత్‌ అద్భుతమైన సెంచరీతో రాణించడంతో, 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేయగలిగింది. పూనమ్‌ 104 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 54 పరుగులు చేసింది. టుమీ సెకుకునే 63 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 48.4 ఓవర్లలో 3 వికెట్లకు 269 పరుగులు చేయడం ద్వారా విజయభేరి మోగించింది. లాజెలె లీ 69, మిగ్నాన్‌ డు ప్రీజ్‌ 61, లారా గుడాల్‌ 59 చూప్పున పరుగులు చేశారు. మానసీ జోషి, రాజేశ్వరీ గైక్వాడ్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తలా ఒక్కో వికెట్‌ కూల్చారు.

DO YOU LIKE THIS ARTICLE?