మిడతల దండుపైదండెత్తుదాం

అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్రాన్ని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు
సమీక్షలో సిఎం కెసిఆర్‌ ఆదేశం

ప్రజాపక్షం/హైదరాబాద్‌
మిడతల దండు ప్రమాదం మరోసారి పొంచి ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని కాపాడే చర్యలపై ముఖ్యమంత్రి కెసిఆర్‌ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మిడతల దండు గమనంపై సమాచారం తెప్పించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మా ట్లాడుతూ గత నెలలో మూడు విడతలుగా దేశంలో ప్రవేశించిన మిడతల దండ్లు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ వరకే వచ్చాయని, తెలంగాణ వైపు రాలేదన్నారు. తాజాగా ఓ మిడతల దండు తెలంగాణ సమీపంలోకి వచ్చిందని, ష్ట్రానికి 200 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలోని రాంటెక్‌ వద్ద గల అజ్ని అనే గ్రామం వద్ద ప్రస్తుతం మిడతల దండు ఉందని, దాని ప్రయాణం దక్షిణం వైపు సాగితే, చాలా తక్కువ సమయంలో తెలంగాణలోకి ప్రవేశించే ప్రమాదం పొంచి ఉందన్నారు. మిడతల దండు దక్షిణంవైపు వస్తే ఏ క్షణమైనా తెలంగాణకు ముప్పే అని తేలిందన్నారు. మరోవైపు ఈ నెల 20 నుంచి జూలై 5 వరకు మళ్లీ మిడతల దండు వచ్చే అవకాశం ఉందని నిపుణులు తేల్చారని, ఆ సమయంలో తెలంగాణలో వర్షాకాలం పంట సీజన్‌ ప్రారంభమయి ఉంటుందని, పంటలు మొలకెత్తి ఉంటాయని, మిడతల దండు దాడి చేసిందంటే చాలా నష్టం జరుగుతుందని, లేత పంటను పీల్చి పారేస్తుందని వివరించారు. ఈ కారణంగా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలోకి మిడతల దండు ప్రవేశించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. మంత్రి సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ విసి ప్రవీణ్‌రావు, సిఐపిఎంసి ప్లాంట్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ ఆర్‌. సునీత, వ్యవసాయ యూనివర్సిటీ సీనియర్‌ శాస్త్రవేత్త రహమాన్‌, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సిఎంఒ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?