మిగులు జలాలపై నివేదికివ్వండి

తెలుగు రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కమిటీ సూచనే
నెలాఖరులోగా సమర్పించాలని విజ్ఞప్తి
వచ్చేనెల మొదటి వారంలో మరోసారి కమిటీ భేటీ

ప్రజాపక్షం/హైదరాబాద్‌: పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు అంశంలో ఈ నెలాఖరులోగా మిగులు జలాలకు సంబంధించిన నివేదికను సమర్పించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కమిటీ రెండు తెలుగు రాష్ట్రాలను సూచించింది. ఇదే అంశంపై వచ్చే నెల మొదటి వారంలో మరోసారి కమిటీ సమావేశం కానుంది. పోతిరెడ్డిపాడు సామ ర్థ్యం పెంపు, 80వేల క్యూసెక్కుల నీటికి సంబంధిం చి ఎపి ప్రభుత్వం జారీ చేసిన జిఒ 203 అంశంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌ కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్‌లోని కృష్ణానదీ జలాల బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌తో బుధవారం రజత్‌కుమార్‌ భేటీ అయ్యా రు. ఈ భేటీలో నీటిపారుదల శాఖ ఇఎన్‌సి మురళీధర్‌, కేంద్ర జలసంఘం సిఇ విజయ్‌ సరన్‌, కృష్ణా బోర్డు సభ్యులు హరికేశ్‌ మీనా, తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌ సిఇలు నరసింహారావు, నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మిగులు జలాల వినియోగం తదితర అంశాలపై వారు చర్చించారు. సమావేశనంతరం రజత్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తలపెట్టిన కొత్త ఎత్తిపోతల ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుందని, కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు తాగు, సాగునీటికి ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. ట్రిబ్యునల్‌లో కృష్ణా జలాల కేటాయింపుల అంశం పెండింగ్‌లో ఉన్నదని, ఇది పరిష్కారం కాకముందే కొత్త ప్రాజెక్టులు చేపట్టడం సరికాదని తెలిపారు. నీటి పర్యవేక్షణకు ఎలాంటి విధానం లేదని, ఎన్నిసార్లు చెప్పినా పోతిరెడ్డిపాడు వద్ద టెలీమెట్రీ ఏర్పాటు చేయడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు 512 టిఎంసిలు, తెలంగాణకు 299 టిఎంసిలు కేవలం తాత్కాలిక కేటాయింపులు మాత్రమేనన్నారు. కృష్ణా జలాల కేటాయింపు విషయమై ఇప్పటికే ట్రైబ్యునల్‌లో కేసు వేసినట్టు వివరించారు. కృష్ణానదీ పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉన్నందున 575 టిఎంసిల నీరు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. కొత్త ఎత్తిపోతల పథకం విషయంలో ఎపి ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోకుండా చూడాలని కృ ష్ణా బోర్డు చైర్మన్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు ఒక్కసారి ప్రారంభమైతే ఎలాంటి సమస్యలు వస్తాయనే విషయాలపై కూడా చర్చించిన ట్టు వివరించారు. సంఘమేశ్వర పాయింట్‌ నుండి 3 టిఎంసిలు, పోతిరెడ్డిపా డు నుండి 88 వేల క్యూసెక్కుల నీటిని తరలించాలని ఎపి ప్రభుత్వం జిఒలో తీసుకొచ్చిందని, మొత్తంగా 8 టిఎంసిలకు ప్రతిపాదించామని చెప్పారు.

DO YOU LIKE THIS ARTICLE?