మా ఊరు పోతాం!

గ్రానైట్‌ వలస కార్మికుల ఆందోళన
ఖమ్మంలో ఉద్రిక్తత
తరలించే ఏర్పాట్లు చేస్తున్నామన్న పోలీస్‌ అధికారులు

ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో : కరోనా వైరస్‌ విజృంభన వల్ల లాక్‌డౌన్‌ విధించడంతో గత 40 రోజులుగా పని లేదు. గ్రానైట్‌ యజమానులు వేతనాలు ఇవ్వడం లేదు. ‘సొంత గ్రామాల్లో మా కుటుంబ సభ్యు లు పస్తులుంటున్నారు. మేము మా ఊరికి వెళ్తాం’ అంటూ గ్రానైట్‌ వలస కార్మికులు ఆందోళనకు దిగారు. మంగళవారం ఖమ్మం నగరంలోని టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట వందలాది కార్మికులు ఆందోళన చేపట్టారు. మా గ్రామాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వండంటూ స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. ఒక దశలో ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కొందరు యువకులు హడావుడి చేయడం పోలీసులు వారికి నచ్చజేప్పే ప్రయత్నంలో తోపులాట జరిగింది. ఖమ్మం జిల్లాలో మొత్తం 60వేల మంది వలస కార్మికులు గ్రానైట్‌ పరిశ్రమలో పని చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా గ్రానైట్‌ పరిశ్రమ ప్రారంభం కావడంతో కొంత మంది పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేయగా సుమారు 20వేల మంది తాము స్వస్థలాలకు వెళ్తామం టూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. బీహార్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు పని చేస్తున్నారు. పరిశ్రమ మూతపడడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని యాజమాన్యాలు ఆర్థిక చేయూత అందించినప్పటికీ సరైన ఫలితం దక్కలేదు. కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు తర్వాత చాలా మంది స్వస్థలాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గత కొద్ది రోజులుగా తమను స్వస్థలాలకు పంపాలంటూ విన్నవించుకుంటున్న వలస కార్మికులు గత మూడు రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. మంగళవారం కాస్త ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. రెండవ పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకున్న డిసిపి మురళీధర్‌, ఎసిపి రామోజీ రమేష్‌ తదితరులు కార్మికులకు నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారులతో మా ట్లాడి కోరిన వారందర్నీ స్వస్థలాలకు పంపుతామని తెలియజేశారు. స్వస్థలాలకు వెళ్తానన్న కార్మికుల వివరాలు నమోదు చేసుకుని రెండు మూడు రోజుల్లో వారి వారి స్వస్థలాలకు తరలిస్తామని మురళీధర్‌ తెలిపారు. రెండు మూడు రోజుల్లో హైదరాబాద్‌ నుండి మహారాష్ట్రకు ప్రత్యేక రైలు బయలు దేరుతుందని, ఆ రైలులో ప్రత్యేక బోగీలను ఏర్పాటు చేయించి తరలిస్తామని అప్పటి వరకు కార్మికులు వేచి ఉండాలని కోరారు. ఆందోళన చేస్తున్న కార్మికులకు స్థానిక టిడిపి నాయకులు భోజన ఏర్పాట్లు చేశారు. ఈ వలస కార్మికుల ఆందోళన ఖమ్మం జిల్లాలో చర్చకు దారితీసింది. ఖమ్మం జిల్లాలో గ్రానైట్‌ పరిశ్రమ ప్రధాన పరిశ్రమగా ఉండగా ఇక్కడ పనిచేస్తున్న వారిలో దాదాపు 90 శాతం మంది వలస కూలీలే. గ్రానైట్‌ పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకమైన తరుణంలో కరోనా వచ్చిపడింది. కరోనా తర్వాతనైనా పరిశ్రమలను పునః ప్రారంభించి ఆర్థిక సంక్షోభం నుంచి గట్టేక్కుదామనుకుంటున్న తరుణంలో ఇప్పుడు కూలీల కొరత మరో ప్రధాన సమస్య కానుంది. 40 రోజులుగా ఎగుమతులు లేకపోవడంతో చాలా మంది యజమానులు విద్యుత్తు బిల్లులు చెల్లించలేదు. విద్యుత్తు బిల్లులు చెల్లించలేదని సరఫరా నిలిపివేయడంతో ఇప్పుడు గ్రానైట్‌ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకమైంది.

DO YOU LIKE THIS ARTICLE?