మారటోరియంపై సమాధానమివ్వండి

కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐలను ఆదేశించిన సుప్రీంకోర్టు
వడ్డీ వసూలు చేసే అంశంపై మూడు రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచన
న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా విధించిన మారటోరియం అంశంపై సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐలను సుప్రీంకోర్టు ఆదేశించింది. మారటోరియం కాలానికి వడ్డీపై వడ్డీ వసూలు చేసే అంశంపై మూడు రోజుల్లోగా ఇరు పక్షాలు సమావేశమై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. రుణాలపై ఆరు నెలల పాటు ఆర్‌బిఐ మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. మారటోరియం కాలంలో చెల్లింపులపై వడ్డీ వసూలు చేయడంపై ఆగ్రాకు చెందిన గజేంద్ర శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎస్‌కె కౌల్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షాతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. అయితే, తామేమీ మారటోరియం కాలం మొత్తానికి వడ్డీ వసూలును మాఫీ చేయాలని అనడం ఏదని, కేవలం వడ్డీపై వడ్డీ వసూలు చేసే అంశం మాత్రమే అడుగుతున్నట్లు ధర్మాసనం పేర్కొంది. విస్తృత ప్రయోజనాలను, సమన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని దీని గురించి ప్రశ్నిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. వడ్డీపై వడ్డీని మాఫీ చేయవచ్చా అనే అంశం వరకు మాత్రమే పరిమితమవ్వాలని సూచించింది. దీనిపై కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా స్పందిస్తూ.. ఆర్‌బిఐతో సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. అయితే దీనిపై మూడు రోజుల్లోగా సమావేశమై, అనంతరం అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని కోరింది. మారటోరియం కాలంలో విధించే వడ్డీని మాఫీ చేయడం సాధ్యం కాదని ఇది వరకే ఆర్‌బిఐ, సుప్రీం కోర్టుకు తెలిపింది. వడ్డీ మాఫీకి అనుమతిస్తే మాత్రం ఆర్థిక సంస్థలు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని పేర్కొంది. అదే జరిగితే వాటిపై ప్రతికూల ప్రభావం చూపడంతోపాటు ఆ సంస్థల స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని ఆర్‌బిఐ తెలిపింది.

DO YOU LIKE THIS ARTICLE?