‘మహా’ కరోనా!

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఒకేరోజు 1,213 కరోనా కేసులు
జిహెచ్‌ఎంసి పరిధిలో 998 పాజిటివ్‌లు
తాజాగా ఖమ్మం జిల్లాను భయపెడుతున్న కొవిడ్‌ 19
కొత్తగా మరో 8 మంది బలి
ప్రజాపక్షం/హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఊహించని రీతిలో ఒకేరోజు 1,213 కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. వెయ్యి మార్కు దాటడం ఇది రెండోసారి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో యథావిధిగా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతుండగా, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలతోపాటు ఈసారి ఖమ్మం జిల్లాలో అనూహ్యంగా అత్యధిక కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,213 కొవిడ్‌ 19 కేసులు నమోదుకాగా, అందులో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జిహెచ్‌ఎంసి) పరిధిలోనే ఏకంగా 998 కేసులు రూఢి అయ్యాయి. కొత్తగా మరో ఎనిమిది మంది కరోనాకు బలయ్యారు. దీంతో మరణాల సంఖ్య 275కి చేరింది. గురువారం నమోదైన మొత్తం కేసులకు గాను రంగారెడ్డి జిల్లాలో 48, మేడ్చల్‌ జిల్లాలో 54 కేసులు రికార్డయ్యాయి. అయితే ఈసారి ఊహించనిరీతిలో ఖమ్మం జిల్లాలో 18 కేసులు దాపురించాయి. అలాగే పొరుగునే ఉన్న బద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో ఏడు కేసులు నమోదయ్యాయి. ఇక వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 10, వరంగల్‌ అర్బన్‌లో 9 కేసులు, నల్లగొండ జిల్లాలో 8, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, కొత్తగూడెం జిల్లాల్లో ఏడేసి కేసులు, రాజన్న సిరిసిల్లలో ఆరు కేసులు, కరీంనగర్‌, మహబూబాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఐదేసి కేసులు నమోదయ్యాయి. అలాగే, నిర్మల్‌, సూర్యాపేట, ములుగు, జగిత్యాల జిల్లాల్లో నాలుగేసి కేసులు, కామారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో రెండేసి కేసులు, గద్వాల జోగులాంబ, సిద్దిపేట, మెదక్‌, యాదా ద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్‌, వికారాబాద్‌ జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి. వలసలు, ప్రవాసులకు సంబంధించి తాజాగా ఎలాంటి కేసులు నమోదు కాకపోవడం గమనార్హం. ఇదిలావుండగా, రాష్ట్ర వ్యాప్తం గా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 18,570కి చేరిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తన హెల్త్‌ బులిటెన్‌లో ప్రకటించింది. కరోనా వైరస్‌ సోకిన వారిలో ఇంకా 9,226 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 9,069 మందిని డిశ్చార్జి చేసినట్లుగా వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. గురువారంనాడు 987 మందిని డిశ్చార్జి చేసినట్లు తెలిపింది. కాగా, గడిచిన 24 గంటల్లో నూతనంగా 5,356 శాంపిల్స్‌ను టెస్టు చేయగా, అందులో 4,143 శాంపిల్స్‌ నెగిటివ్‌గా నిర్ధారించారు. ఇప్పటివరకు మొత్తం 98,153 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

DO YOU LIKE THIS ARTICLE?