మరో 237 కేసులు

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా

మరో ముగ్గురు మరణం
ప్రజాపక్షం/హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో శనివారం 253 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఆదివారం దాదాపు అదేస్థాయిలో 237 కేసులు నమోదయ్యాయి. అలాగే కొత్తగా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 185కి చేరింది. ఆదివారం నమోదైన 237 కేసుల్లో జిహెచ్‌ఎంసి పరిధిలోనే 195 పాజిటివ్‌లు గుర్తించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ కాకుండా దాన్ని ఆనుకొని వున్న రంగారెడ్డి జిల్లాలో కొత్తగా మరో 8, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో కొత్తగా 10 కేసులు నమోదు అయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో శనివారం 24 కేసులు నమోదుకాగా, తాజాగా మరో ఐదు కేసులను పాజిటివ్‌లుగా గుర్తించారు. ఇక మంచిర్యాలలో ముగ్గురు కరోనా బారిన పడగా, మహబూబ్‌నగర్‌, వరంగల్‌ అర్బన్‌, కరీంనగర్‌, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో రెండేసి కేసులు నమోదయ్యాయి. మెదక్‌, సిరిసిల్ల, ఆదిలాబాద్‌, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వరంగల్‌ రూరల్‌ జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి. వలసలు, ప్రవాసులకు సంబంధించి ఆదివారం ఎలాంటి కేసులు నమోదు కాలేదు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల్లో 4525 కేసులు స్థానికంగా నమోదైనవే. ఇదిలావుండగా, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 4974కి పెరిగిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తన హెల్త్‌ బులిటెన్‌లో ప్రకటించింది. కరోనా వైరస్‌ సోకిన వారిలో ఇంకా 2412 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 2377 మందిని డిశ్చార్జి చేసినట్లుగా వైద్యఆరోగ్య శాఖ తెలిపింది.

DO YOU LIKE THIS ARTICLE?