మరో 219 కేసులు

రాష్ట్రంలో 5 వేలు దాటిన కరోనా కేసులు
మరో ఇద్దరు మరణం
ప్రజాపక్షం/హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ కలకలం రేపుతోంది. కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య ఐదు వేలు దాటింది. రాష్ట్రంలో కొత్తగా సోమవారం మరో 219 కొవిడ్‌ 19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అలాగే కొత్తగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 187కి చేరింది. సోమవారం నమోదైన 219 కేసుల్లో జిహెచ్‌ఎంసి పరిధిలోనే 189 పాజిటివ్‌లు గుర్తించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ కాకుండా దాన్ని ఆనుకొని వున్న రంగారెడ్డి జిల్లాలో కొత్తగా మరో 13, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో కొత్తగా 2 కేసులు నమోదు అయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో సోమవారం మరో రెండు కేసులు నమోదుకాగా, వరంగల్‌ అర్బన్‌లో నాలుగు, వరంగల్‌ రూరల్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, యాదాద్రి భువనగిరి, వనపర్తి, పెద్దపల్లి జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి. వలసలు, ప్రవాసులకు సంబంధించి సోమవారం ఎలాంటి కేసులు నమోదు కాలేదు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల్లో 4744 కేసులు స్థానికంగా నమోదైనవే. ఇదిలావుండగా, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 5193కి పెరిగిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తన హెల్త్‌ బులిటెన్‌లో ప్రకటించింది. కరోనా వైరస్‌ సోకిన వారిలో ఇంకా 2240 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 2766 మందిని డిశ్చార్జి చేసినట్లుగా వైద్యఆరోగ్య శాఖ తెలిపింది.

DO YOU LIKE THIS ARTICLE?