మరో మూడుచోట్ల కరోనా సెంటర్లు

ప్రజాపక్షం/హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో మూడు కరోనా వైద్య పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు, దీనికి సంబంధించి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. కోటి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో బుధవారం కరోనా వైరస్‌పై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకూ గాంధీ ఆసుపత్రిలోనే చేస్తున్న కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలను ఇకపై కాకతీయ మెడికల్‌ కాలేజీ, నారాయణ గూడలోని ఐపిఎం(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటీవ్‌ మెడిసిన్‌), ఫీవర్‌ ఆసుపత్రిలోనూ చేయనున్నారు. ఉస్మానియాలోనూ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని ఇప్పటికే మం త్రి ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం గాంధీ హాస్పిటల్‌తో పాటుగా ఉస్మానియా మెడికల్‌ కాలేజీ, కాకతీయ మెడికల్‌ కాలేజ్‌, ఐపీఎం, నారాయణ గూడ, ఫీవర్‌ హాస్పిటల్‌లో కూడా కరోనా వైరస్‌ పరీక్షలకోసం కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అనుమతించిందని తెలిపారు. మరో ఐదు రోజుల్లో ఈ ల్యాబ్లో పరీక్షలు మొదలు కానున్నాయని ఆయన వెల్లడించారు. దీని కోసం కావాల్సిన వైద్య పరికరాలు, సిబ్బంది, వైద్యులను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. మరో తొమ్మిది జిల్లాల్లో కూడా ఇసోలేషను సెంటర్స్‌ను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నా రు. గాంధీ తరహాలోనే అదిలాబాదులో కూడా కరోనా చికిత్స ను అందించేందుకు ఆసుపత్రిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతానికి గాంధీలో చికిత్స పొందుతున్న వ్యక్తికి రెండోసారి పరీక్షలో కూడా నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చినట్లు ఆయన వెల్లడించారు. అతనిని డిఛార్జ్‌ చేయబోతున్నట్లు, దీనిని ప్రజలు గమనించాలని ఆయన కో రారు. సోషల్‌ మీడియాలో బాధ్యతలేని కొంతమంది వ్యక్తులు చేస్తున్న ప్రచారం తప్పు అని తేలిపోయిందని ఆయన తెలిపారు. కరోనా సోకిన వ్యక్తులలో 81 శాతం మందిలో వైరస్‌ సోకిన ప్రభావం చూపించదని, 14 శాతం మందిలో మాత్రమే ట్రీట్మెంట్‌ అవసరం అవుతుందని గుర్తుచేశారు. ప్రపంచంలో అతి ఎక్కువ మంది చనిపోయిన చైనాలో సైతం మూడు శాతం మంది మాత్రమే కరోనా వైరస్‌ వల్ల చనిపోయారని ఆయన వివరించారు. ఈ క్షణానికి తెలంగాణ గడ్డ మీద ఒక్క కరోనా పాజిటివ్‌ పేషెంట్‌ కూడా లేరని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
కరోనా వైరస్‌ సోకిన వ్యక్తులకు లక్షణాలను బట్టి చికిత్స అందించాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చేవారిని ఎయిర్‌ పోర్ట్‌లో ప్రతి ఒక్కరిని స్క్రీన్‌ చేస్తున్నామన్నారు. కరోనా లక్షణాలు ఉంటే అక్కడి నుంచి నేరుగా వారిని గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నామన్నారు. కరోనా వైరస్‌ను నిరోధించడంలో సమర్థవంతంగా పని చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిందని ఆయన చెప్పారు.

DO YOU LIKE THIS ARTICLE?