మరియమ్మ లాకప్‌డెత్‌ కేసులో ముగ్గురిపై వేటు

ఉద్యోగాల నుంచిఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల తొలగింపు
యాదాద్రి జిల్లా పోలీస్‌ చరిత్రలో ఇదే ప్రథమం
దోషులను శిక్షించాలని దళిత సంఘాలు, ప్రతిపక్షాల ఒత్తిడి మేరకు చర్యలు
ప్రజాపక్షం / యాదాద్రి/ అడ్డగూడూరు
దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్‌కు కారణమైన పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. అడ్డగూడూరు పోలీసు స్టేషన్‌లో లాకప్‌డెత్‌కు బాధ్యులైన ఎస్‌ఐ వి.మహేశ్వర్‌, కానిస్టేబుళ్లు ఎం.ఎ.రషీద్‌ (పిసి 3056), పి. జానయ్య (పిసి 2012)లను సర్వీసుల నుంచి తొలగించినట్లు రాచకొండ పోలీసు కమిషనరేట్‌ తెలియజేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 311 ((2) (బి), ప్రవర్తనా నియమావళిలోని 25 (2) ప్రకారం ఈ నెల 20న ముగ్గురు సిబ్బందిని సర్వీసు నుంచి తొలగించినట్లు కమిషనర్‌ కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇదిలా ఉండగా మరియమ్మ లాకప్‌డెత్‌ ఘటన రాష్ట్ర సర్కార్‌ను ఒక కుదుపు కుదిపివేసింది. ఘటన విషయంలో కేసులతో సరిపెట్టకుండా దోషులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు గత నెల రోజులుగా ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చాయి. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగరకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. సిఎం కెసిఆర్‌ ఆదేశాలతో పోలీసు ఉన్నతాధికారులు మరియమ్మ ఘటనపై లోతుగా దర్యాప్తు చేయడంతో పోలీసుల చిత్రహింసల కారణంగానే మరియమ్మ లాకప్‌డెత్‌కు గురైందని, పోస్టుమార్టం నివేదిక కూడా అదే విధంగా రావడంతో ఇందుకు బాధ్యులైన పోలీసు సిబ్బందిని సర్వీసు నుంచి తొలగించింది. ఈ ఘటనపై చేసిన పోరాటం ఫలించడంతో దళిత వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. మరియమ్మ లాకప్‌డెత్‌ విషయాన్ని కాంగ్రెస్‌ ఎస్‌సి సెల్‌ అధ్యక్షుడు ప్రీతం వెలుగులోకి తీసుకొచ్చారు. సిఎల్‌పి నేత భట్టివిక్రమార్క, పిసిసి మాజీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆందోళన కార్యక్రమాలతో పాటు న్యాయపోరాటం మొదలు పెట్టడంతో సిఎం కెసిఆర్‌ ఈ ఘటనపై స్పందించి విచారణ చేయాలని డిజిపిని ఆదేశించారు. సిఎం కెసిఆర్‌ తన సర్కార్‌పై ఈ ఘటనతో దళితుల్లో వ్యతిరేకత పెరగకుండా బాధిత కుటుంబానికి తగిన పరిహారం ప్రకటించి కొంత మేరకు నిరోధించుకున్నారు.
సర్వీసు నుంచి తొలగించడం ఇదే ప్రథమం
యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసు చరిత్రలో సర్వీసు నుంచి ముగ్గురిని తొలగించడం ఇదే ప్రథమం కావడం పోలీస్‌ శాఖలో తీవ్ర సంచలనం కలిగిస్తున్నది. ఇప్పటి వరకు బదిలీలు, చార్జీ మెమోలు, ఆటాచ్‌మెంట్లు, వీఆర్‌తో సరిపెట్టిన పోలీస్‌ బాస్‌లు ఒక్కటి రెండు కేసుల్లో మాత్రం సిఐ స్థాయి అధికారుల వరకు సస్పెన్షన్‌ వేటు వేశారు. ఆత్మకూర్‌ (ఎం) మండలం పల్లెర్లలో జరిగిన అంబోజు నరేష్‌-స్వాతిల కులదురంహాకార హత్య కేసులో నింధితులకు ఎస్‌ఐ సహకరించినట్టు వాయిస్‌ రికార్డు దొరకడంతో ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేశారు. మూడు నెలల్లోనే తిరిగి ఆ ఎస్‌ఐకి పోస్టింగ్‌ ఇచ్చారు. అదే విధంగా చౌటుప్పల్‌, భువనగిరి రూరల్‌ సిఐలను వేర్వేరు ఘటనల్లో భాగస్వాములు కావడంతో సిపి మహేశ్‌భగవత్‌ వారిని సస్పెండ్‌ చేశారు. ఇటీవల రామన్నపేట ఠాణా పరిధిలో కూడా ఓ మహిళ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్‌ఐ, సిఐలపై పోలీస్‌బాస్‌ వేటు వేశారు. జిల్లా ఏర్పడి రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోకి వెళ్లినప్పటి నుంచి విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యం, అవినీతి, అక్రమాలకు పాల్పడిన పోలీసులపై సస్పెన్షన్‌ వరకు మాత్రమే వేటు పడింది. మరియమ్మ ఘటనలో ఏకంగా ముగ్గరు పోలీసులను సర్వీసు నుంచి తొలగించడం పోలీసు శాఖలో తీవ్ర కలకలం సృష్టిస్తున్నది.

DO YOU LIKE THIS ARTICLE?