మరింత అప్రమత్తం

రాష్ట్రాల సిఎంలతో ప్రధాని భేటీ చేయూతనివ్వాలని కోరిన ముఖ్యమంత్రులు
న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా వుండాలని ప్రధానమంత్రి నేరంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ, మనిషి ప్రాణాలు, జీవనభృతికి ప్రాధాన్యతనివ్వడం జరిగిందని అన్నారు. కరోనాను గుర్తించేందుకు మరి న్ని పరీక్షలు నిర్వహించడానికి ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచడంతోపాటు ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకోవడానికి అన్ని రాష్ట్రాలు దృష్టి పెట్టాలని కోరా రు. వాస్తవానికి రాష్ట్రాల సహకారంతో కరోనా వైరస్‌పై భారత్‌ దీటుగా పోరాడుతోందని మోడీ అన్నారు. దేశంలో కరోనా వైరస్‌ పరిస్థితి, లాక్‌డౌన్‌ నిబంధనల అమలుపై ప్రధాని మంగళవారం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థ చితికిపోయిన నేపథ్యంలో కేంద్రం తన సహకారాన్ని పెంచాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరారు. అలాగే కరోనా టెస్టింగ్‌ పరికరాలను, ఇతర అవసరాలను తీర్చడానికి చర్యలు చేపట్టాలని కోరారు. జూన్‌ 30తో లాక్‌డౌన్‌ ముగియనుండటంతో చేపట్టాల్సిన చర్యలపై సిఎంలతో ప్రధాని చర్చించారు. కోవిడ్‌-19 బారినపడి కోలుకునే వారి సంఖ్య 50 శాతం దాటిందని వెల్లడించారు. మహమ్మారిపై పోరు మన సహకార సమాఖ్య విధాన స్ఫూర్తిని చాటిందని చెప్పారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ కరోనా మహమ్మారితో మెరుగ్గా పోరాడుతోందని, మనపై మహమ్మారి ప్రభావం కొంతమేర తక్కువేనని చెప్పుకొచ్చారు. గత కొద్దివారాలుగా పలు దేశాల నుంచి పెద్దసంఖ్యలో భారతీయులు, వలస కూలీలు స్వస్థలాలకు చేరుకున్నారని చెప్పారు. సుదీర్ఘ లాక్‌డౌన్‌ అనంతరం పలు స డలింపులు ప్రకటించిన అనంతరం ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పుం జుకుంటున్నాయని అన్నారు. మార్కెటింగ్‌ విధానంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో రైతుల ఆదాయం మెరుగుపడటమే కాకుండా వారి ఉత్పత్తులను గిట్టబాటు ధరలకు విక్రయించేలా తోడ్పడుతుందని చెప్పారు. స్ధానిక ఉత్పత్తులను గుర్తించి, అక్కడే ప్రాసెస్‌ చేసి దేశవ్యాప్తంగా మార్కెటింగ్‌ చేసుకునే వెసులుబాటు ఉందని అన్నారు. ఈ సమావేశంలో పంజాబ్‌, కేరళ, గోవా, ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌ సహా పలు ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్లు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?