మయన్మార్‌లో ఘోర దుర్ఘటన

జాడె గనుల్లో కొండచరియలు విరిగిపడి 162 మంది దుర్మరణం

పహకాంత్‌ : మయన్మార్‌లో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాలు కురవడంతో ఉత్తర మయన్మార్‌లోని జాడె గనుల వద్ద గురువారం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో దాదాపు 162 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రాంతంలో ఇటీవలి సంవత్సరాల్లో తరుచూ ఇలాంటి ఘోర దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. హపకాంత్‌లోని జాడె గనుల వద్ద కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో 162 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచార మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, కాచిన్‌ రాష్ట్రంలోని జాడె హపకాంత్‌ ప్రాంతంలో రాళ్ళు సేకరిస్తున్నప్పుడు భారీ వర్షం కారణంగా గురువారం కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా మృతుల్లో మైనర్లు ఉన్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మట్టిదిబ్బలో చాలా మంది చిక్కుకుపోయారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అగ్నిమాపక విభాగం ఓ ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ద్వారా వెల్లడించింది. ప్రమాద సమయంలో 38 ఏళ్ల మౌంగ్‌ ఖాన్‌ అనే వ్యక్తి రన్‌.. రన్‌ అంటూ అరుస్తూ మిగిలిన వాళ్లని అప్రమత్తం చేశాడు. కానీ దురదృష్టవశాత్తూ అతను అక్కడే మట్టిదిబ్బల్లో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటన వీడియో ఫుటేజీలో రికార్డు అయ్యింది. ఇదిలా ఉండగా, హప్‌కాంత్‌ గనులలో ఇటీవలి వరుసగా కొండచరియలు విరిగిపడి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయతే గత ఐదేళ్లనుంచి జరిగిన ప్రమాదాల్లో ఇది అత్యధికం. 210 కూడా కొండచరియలు విరిగిపడిన ఘటనలో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇక్కడ మైనింగ్‌ కార్యకలాపాలను మూసివేయాలని పలువురు డిమాండ్‌ చేశారు. అప్పట్లో తాత్కాలికంగా ఇది మూతపడ్డా వెంటనే మళ్లీ పరిశ్రమలు తెరుచుకున్నాయి. పేదరికాన్ని అడ్డుపెట్టుకొని కొందరు మైనర్లను పనిలో పెడతారని స్థానికులు పేర్కొన్నారు. ఇప్పటికే అనేకమంది ప్రాణాలు కోల్పోయినా, అధికారులు పట్టించుకోవడం లేదని అక్కడి మీడియా నివేదించింది. ఈ ప్రాంతంలో మైనింగ్‌ అమ్మకాలు జోరుగా సాగుతాయని ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2016 మయన్మార్‌లో అత్యధికంగా 671 మిలియన్‌ యూరోలు (750.04 మిలియన్‌ డాలర్లు) వ్యాపారం జరిగిందని తెలుస్తోంది.

DO YOU LIKE THIS ARTICLE?