మధ్యాహ్నానికే షాపులు బంద్‌

గల్లీల్లోనూ పోలీసుల గస్తీలు
అనవసరంగా రోడ్లపైకి వస్తే  తిప్పలే
మరింత కఠినంగా లాక్‌డౌన్‌ రెండవ దశ

ప్రజాపక్షం/ హైదరాబాద్‌ : రెండవ దశ లాక్‌డౌన్‌ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుండే పోలీసులు కట్టడి మొదలుపెట్టారు. ప్రధానంగా వివిధ నిత్యావసర షాపులను మధ్యాహ్నం 12 గంటల వరకే మూసివేస్తున్నారు. కూరగాయాల మార్కెట్ల వద్ద కూడా అనవసరంగా ఎవ్వరూ నిలబడకుండా కట్టడి చేశారు. ప్రధానంగా క్వారంటైన్‌ జోన్ల సమీపంలోని  ప్రాంతాలతోపాటు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల సమీపంలో పోలీసులు మరింత కట్టడి చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండే రోడ్ల మీదకు రానివ్వడం లేదు. అత్యవసర సేవలు మినహా ఇతర కారణాలు చెబుతన్న వారిపై లాఠీలను కూడా ఝులిపిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గ సమావేశనంతరం లాక్‌డౌన్‌ను మే 7వ తేదీ వరకు పొడిగించడంతో పాటు లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజు నుండే  పోలీసులు మరింత కట్టడి చేస్తున్నారు.  మధ్యాహ్నం 2.30 గంటలకు నిత్యావసర సరుకుల కోసం షాపుకు వెళ్తే అప్పటికే బంద్‌ చేసి ఉన్నాయని జూబ్లీహిల్స్‌కు చెందిన సయ్యద్‌ అలీ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషర్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. మధ్యాహ్నం 2 గంటలలోపే షాపులను బలవంతంగా ముసివేస్తున్నారు. దీనికి హైదరాబద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ స్పందిస్తూ నిత్యావసర షాపులను త్వరగా ముసివేయాలని తాము ప్రత్యేకంగా సర్క్యులర్‌ను జారీ చేయలేదని ట్వీట్టర్‌లో సమాధానమిచ్చారు. అయితే పోలీసులు అధికారికంగా ఆదేశాలు జారీ చేయకపోయినప్పటికీ స్థానికంగా పోలీసులు మాత్రం స్థానిక పరిస్థితుల మేరకు షాపులను మూయిస్తున్నారు.
పలు ప్రాంతాల్లో బారీకేడ్లు
కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేసులు నమోదువుతున్న ప్రాంతాలు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలలలో బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆ ప్రాంతానికి ఎవ్వరూ వెళ్లకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఆయా ప్రాంతాల వారు కూడా తమ ప్రాంతాలను కొత్తవారు రాకుండా ఉండేలా రోడ్డుకు అడ్డంగా వాహనాలను అడ్డుపెడుతున్నారు. మధ్యాహ్నం నుండే ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ రోడ్లపైకి జనాలు రాకుండా హెచ్చరికలు జారీ చేయడంతో పాటు భౌతిక దూరం పాటించని వారిపై చర్యలు తీసుకుంటున్నారు. భౌతిక దూరం పాటించని, రోడ్లపైకి గుంపులుగా వస్తున్నారని ‘డయల్‌ 100’కు ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రధాన రహదారులే కాదు చిన్న పాటి గల్లీలలో కూడా పోలీసులు గస్తీలు నిర్వహిస్తున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?