మతతత్వ శక్తులను ఎదుర్కోడానికి ఇంద్రజిత్‌ గుప్తా మార్గమే శరణ్యం

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
ప్రజాపక్షం / హైదరాబాద్‌ : దేశాన్ని విచ్చిన్నం చేస్తున్న మతతత్వ శక్తులను ఎదుర్కోడానికి ఇంద్రజిత్‌ గుప్తా చూ పిన మార్గమే శరణ్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర సమర యోధులు, సిపిఐ జీనియర్‌ నాయకులు భారత మాజీ హోం మంత్రి ఇంద్రజిత్‌ గుప్తా శత జయంతి ముగింపు కార్యక్రమం బుధవారం మఖ్దూంభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డితో పాటు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాలమల్లేష్‌, రాష్ట కార్యవర్గ సభ్యులు డాక్టర్‌ సుధాకర్‌, ఎఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్‌, ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌ స్టాలిన్‌, అగర్తల కార్పొరేటర్‌ జయా బిశ్వాస్‌, తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ, బికెఎ యు రాష్ట్ర కార్యదర్శి కాంతయ్యతదితరులు ఇంద్రజిత్‌ గుప్తా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కోల్‌కొత్తలోని పారిశ్రామిక కుటుంబంలో జన్మించిన ఇంద్రజిత్‌ గుప్తా లండన్‌లో విద్యభ్యాసం పూర్తి చేసి వి ద్యార్థి సమాఖ్య పట్ల ఆకర్శితులై అంచెలంచెలుగా పార్టీ లో ఎదిగారన్నారు.
11 సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికకావడం ఊహకందని పరిణామమన్నారు. ప్రజాసమస్యలపై నిత్యం పార్లమెంటులో పోరాడుతూ పాలకుల ను నిలదీశారని తెలిపారు. దేశంలోనే ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పేరుగాంచిన ఇంద్రజిత్‌ గుప్తా దేశ హోం మంత్రిగా దేశాన్ని విచ్చిన్న పరుస్తున్న మతతత్వ పరిస్థితులను ఎదుర్కోడానికి లౌకిక శక్తులు ఏకం కావాలని ఆనాడు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం, వేతన సవరణ కోసం, కార్మి క చట్టాల రూపకల్పనలో, పౌరహక్కులను కాపాడాలని రాజీలేని పోరాటం చేసిన యోధుడు ఇంద్రజిత్‌ గుప్తా అని కొనియాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన పార్లమెంటులో, పలు సందర్భంల్లో చేసిన ఉపన్యాసాలు మరోసారి అధ్యయనం చేసి మతతత్వ శక్తులపై పోరా టం చేయడమే ఆయనకు నిజమైన నివాళి అర్పించిన వారమవుతామన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?