మంత్రిగిరీ ఎవరికి?

హైదరాబాద్‌ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మంత్రివర్గ ముహూర్తం ఎట్టకేలకు ఈనెల 19న ఖరారైంది. ఇక మంత్రియోగం ఎవరిని వరిస్తుంది.. కెసిఆర్‌ జట్టులో చోటు దక్కేదెవరికి అనేది తాజా మాజీ మంత్రులు, సీనియర్‌ ఎంఎల్‌ఎలలో తీవ్ర ఉత్కంఠత నెలకొన్నది. కాగా సామాజిక న్యాయాన్ని పాటించడంతో పాటు పాత పది ఉమ్మడి జిల్లాలకు ఒకరు చొప్పున సుమారు పది మంది వరకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కొందరు తాజా మాజీలతో పాటు కొత్తగా కొప్పుల ఈశ్వర్‌, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎర్రబెల్లి యాదకర్‌రావు, వినయ్‌ భాస్కర్‌, రెడ్యానాయక్‌, పువ్వాడ అజాయ్‌కుమార్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. గత మంత్రి వర్గంలో మహిళలకు అవకాశం లేకపోవడంతో ఈసారి వారికి ప్రతినిధ్యం కల్పించాలని సిఎం భావిస్తున్నారు. మహిళా కోటాలో మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంఎల్‌ఎ రేఖనాయక్‌ పేర్లు పరిశీలనలో ఉన్నా యి. కాగా మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, నిజామాబాద్‌ నుంచి వేముల ప్రశాంత్‌ రెడ్డి, కరీంనగర్‌ జిల్లా నుంచి ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, వరంగల్‌ జిల్లా నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వినయ్‌ భాస్కర్‌, నల్లగొండ నుంచి జి.జగదీశ్‌రెడ్డి, ఆదిలాబాద్‌ నుంచి ఇంద్రకరణ్‌ రెడ్డి లేదా జోగురామన్న, హైదరాబాద్‌ నుంచి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రంగారెడ్డి జిల్లాలో తాజా మాజీమంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి ఓడిపోయిన నేపథ్యంలో ఇక్కడి నుంచి అవకాశం కల్పించాలా? లేదా మరోసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలా అనే అంశంపై చర్చలు జరిపారు.

DO YOU LIKE THIS ARTICLE?